ఉత్తానపాదుడు అంతగా బాధపడుతుండటం చూసిన నారద మహర్షి, ఆయనలో మార్పు వచ్చినందుకు మనసులోనే సంతోష పడతాడు. ధృవుడి గురించి కంగారు పడవలసిన అవసరం లేదనీ, ఆయన క్షేమంగానే ఉన్నాడని నారద మహర్షి చెబుతాడు. ఆ మాట వినగానే ఉత్తానపాదుడి ముఖం ఒక్కసారిగా వెలిగిపోతుంది. తన ధృవుడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని ఆత్రుతగా అడుగుతాడు. తను వెంటనే ధృవుడిని చూడాలని అంటాడు. అందుకు వెంటనే ఏర్పాట్లు చేయమని సైన్యాధ్యక్షుడిని ఆదేశిస్తాడు. ధృవుడు ఎక్కడ ఉన్నది చెబితే వెంటనే అక్కడికి బయల్దేరతామని అంటాడు.

ధృవుడు కఠోరమైన తపస్సుతో శ్రీమన్నారాయణుడిని మెప్పించి, ఆయన అనుగ్రహాన్ని పొందాడని నారదుడు చెబుతాడు. అలాంటి కుమారుడిని కనడం ఆయన చేసుకున్న అదృష్టమని అంటాడు. మహర్షులకు సైతం అరుదుగా లభించే వరం ధృవుడికి లభించిందనీ, స్వామి సాక్షాత్కారాన్ని పొందిన ధృవుడు రాజ్యానికి తిరిగి వస్తున్నాడని చెబుతాడు. ఆ మాట వినగానే, అంతటి చల్లని మాటను చెప్పిన నారదుడి పాదాలకు ఆయన నమస్కరిస్తాడు. ధృవుడిని ఘనంగా ఆహ్వానించడానికి చకచకా ఏర్పాట్లు చేస్తాడు.

రాజ్యంలోకి ధృవుడు అడుగుపెడుతూ ఉండగానే ఆయన తండ్రి ఎదురుగా వచ్చి ప్రేమానురాగాలతో అక్కున చేర్చుకుంటాడు. ఉత్తముడు కూడా ధృవుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ తరువాత ధృవుడిని ఏనుగుపై కూర్చోబెట్టి ఊరేగిస్తూ అంతఃపురానికి బయల్దేరతారు. దారి పొడవునా ప్రజలంతా కూడా ధృవుడికి జేజేలు పలుకుతారు. అంతటి చిన్న వయసులో శ్రీహరి సాక్షాత్కారాన్ని పొందిన అతను సామాన్యుడు కాదని చర్చించుకుంటూ ఉంటారు. అలా అంతా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండగా, ధృవుడు అంతఃపురానికి చేరుకుంటాడు.

ధృవుడు అంతఃపురానికి చేరుకోగానే తల్లి సునీతి పరుగు పరుగున వస్తుంది. ప్రేమతో తన కొడుకును అక్కున చేర్చుకుంటుంది. తల్లి స్పర్శ తాకగానే ధృవుడి కళ్లు చెమ్మగిల్లుతాయి. సునీతి అతని ఒళ్లంతా ప్రేమతో నిమురుతుంది. శ్రీమన్నారాయణుడి దర్శనంతో ఆయన జన్మ ధన్యమైందని అంటుంది. తన చేతితో బిడ్డకు అన్నం తినిపించడానికి సిద్ధమవుతుంది. అదే సమయంలో సురుచి కూడా అక్కడికి వస్తుంది. ఆమె కూడా అతణ్ణి ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుంది. ఆమెలో వచ్చిన మార్పు ధృవుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. అదంతా ఆ స్వామి దయనే అని అనుకుని మనసులో ఆయనకి నమస్కరించుకుంటాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.