శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో “గురువాయూర్” ఒకటి. ఇది కేరళ రాష్ట్రం – త్రిచూర్ ప్రాంతానికి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడి నుంచి చాలా తేలికగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చును. ఇక్కడ పూజాభిషేకాలు అందుకునే స్వామివారి మూర్తి యుగయుగాల నాటిదని చెబుతారు. శ్రీకృష్ణుడు అవతరించడానికి ముందుగానే బ్రహ్మదేవుడు ఆయన రూపాన్ని ఈ విగ్రహంగా మలచుకుని ఆరాధించాడని అంటారు. బ్రహ్మదేవుడు ఈ ప్రతిమను శ్రీకృష్ణుడికి ఇవ్వగా, ఆయన మందిరంలోను ఆరాధనలు అందుకుందని చెబుతారు.

శ్రీకృష్ణుడు భూలోకాన చేయవలసిన ధర్మ కార్యాలు పూర్తయ్యాయి తిరిగి ఆయన వైకుంఠానికి చేరుకునే సమయం ఆసన్నమైంది. ద్వాపర యుగం అంతమైపోతుందని భావించిన కృష్ణుడు, తన మిత్రుడైన ఉద్ధవుడిని పిలిచి ఆ విగ్రహాన్ని ఆయనకి అందజేస్తాడు. మరి కాసేపట్లో ప్రళయం సంభవించనుందనీ, ద్వారక అంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుందని చెబుతాడు. తన అవతార పరిసమాప్తి జరగనుందనీ, అందువలన తన విగ్రహాన్ని ప్రళయానికి దూరంగా తీసుకుని వెళ్లి ప్రతిష్ఠించమని అంటాడు.

ఈ విషయంలో బృహస్పతి – వాయుదేవుడి సహాయం తీసుకోమని కృష్ణుడు ఉద్ధవుడిని పంపించివేస్తాడు. స్వామి చెప్పినట్టుగానే ప్రళయం మొదలవుతుంది. ఆ ప్రళయ సంకేతాలు చూసి ఉద్ధవుడు భయపడిపోతాడు. దాంతో ఆయన బృహస్పతి – వాయుదేవులను ప్రార్ధిస్తాడు. వారు ప్రత్యక్షమై ఉద్ధవుడి నుంచి విగ్రహాన్ని తీసుకుని ఆకాశమార్గం ద్వారా ప్రస్తుతం ఉన్న గురువాయూర్ ప్రదేశానికి చేరుకుంటారు. ప్రళయ సంకేతాలు లేకుండా ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రదేశం యొక్క పవిత్రతను గురించి పరశురాముడి ద్వారా వారికి తెలుస్తుంది. పరమశివుడి సూచనమేరకు వారు అక్కడ స్వామివారి మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు.

గురువు – వాయువు కలిసి ప్రతిష్ఠ చేసిన ప్రదేశం గనుక ఈ క్షేత్రానికి గురువాయూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడి స్వామివారిని అంతా “అప్పా” అని పిలుచుకుంటూ ఉంటారు. ఆ తరువాత కాలంలో స్వామివారికి ఆలయ నిర్మాణం జరిగింది. ఆయా రాజుల ఏలుబడిలో ఈ క్షేత్రం యొక్క వైభవం పెరుగుతూ వచ్చింది. పొడవైన ప్రాకారాలతో .. ఎత్తైన గోపురాలతో .. మంటపాలతో ఈ ఆలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో స్వామివారు నాలుగు చేతులతో .. శంఖు .. చక్ర .. గద .. పద్మం కలిగి దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి పూజా నియమావళిని ఆదిశంకరులవారు ఏర్పరిచినట్టుగా చెబుతారు.

తులాభారంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ప్రతి శుద్ధ ఏకాదశికి ఇక్కడ జరిగే ప్రత్యేకమైన సేవలు .. ఉత్సవాలు చూసితీరవలసిందే. స్వామివారికి జరిగే ఉత్సవాలు .. ఆ ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులను చూస్తే ఈ క్షేత్ర వైభవం ఎంతటిదో అర్థమవుతుంది. ఎంతోమంది మహాభక్తులు .. రాజులు స్వామివారిని సేవించి తరించారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులు .. బాధలు తగ్గిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన క్షేత్రాల్లో గురువాయూర్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.