Sri Bhagavatam – Hari Bhakti increased in Prahlad
ప్రహ్లాదుడు పసివాడు … అతనికి అప్పుడే తన మనసు అర్థం కాదు. తమకి శ్రీహరి శత్రువు అని చెబితే అర్థం చేసుకునే వయసు అతనికి లేదు. అందువలన అతనిపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం వలన ప్రయోజనం లేదని హిరణ్యకశిపుడు భావిస్తాడు. ప్రహ్లాదుడి గురువులను పిలిచి, ముందుగా శ్రీహరి నామాన్ని మాన్పించమని చెబుతాడు. తాను మరలా ప్రహ్లాదుడిని కలుసుకునే సమయానికి అతని నోటి వెంట నారాయణుడి మాట రాకూడదని ఆదేశిస్తాడు. అలా జరిగితే తన కోపాన్ని చవి చూడవలసి వస్తుందని హెచ్చరించి పంపిస్తాడు.
ప్రహ్లాదుడిని గురుకులానికి తీసుకెళ్లిన చండామార్కులు .. ఆయనతో నారాయణుడి నామాన్ని మాన్పించడానికి తమవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాను కొత్తగా నేర్చుకున్నది ఏమీ లేదనీ .. వాళ్లు బోధించిన వేదాలలోని సారం అదేనని ప్రహ్లాదుడు అంటాడు. అందువలన తన తండ్రి దగ్గర తాను అదే చెప్పానని అంటాడు. సమస్త జీవులకు ఆహారాన్ని అందించువాడు .. ఆనందాన్నిచ్చువాడిని స్మరించడం మరువడం కంటే మరణమే మేలని చెబుతాడు. విష్ణు నామం ఓ జీవధార .. నిరంతరం దానిని సేవిస్తూ ఉండటం వలన కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం అని అంటాడు.
ప్రహ్లాదుడిని గురువులు తమ అక్కున చేర్చుకుంటారు. ఆయన తండ్రి హిరణ్యకశిపుడు మహాశక్తిశాలి అని చెబుతారు. ఆయన దేవతలపై కూడా విజయాన్ని సాధించిన విషయాన్ని వివరిస్తారు. ముల్లోకవాసులు హిరణ్యకశిపుడి పేరు చెబితేనే భయపడతారని అంటారు. అలాంటి పరాక్రవంతుడి కొడుకుగా జన్మించడం అతను చేసుకున్న అదృష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రాజ్యంలోని ప్రజలంతా హిరణ్యకశిపుడి నామస్మరణ చేస్తూ ఉండగా, ఆయన కొడుకువైన నీవు హరినామ స్మరణ చేయడం సరికాదని సున్నితంగా మందలిస్తారు.
అయినా ప్రహ్లాదుడి ధోరణిలో మార్పు రాకపోవడం, ఆయన గురువులకు ఆందోళన కలిగిస్తుంది. ఎంతగా చెప్పినా అతను హరినామస్మరణ మానడం లేదు. అతని కారణంగా గురుకులంలోని ఇతర విద్యార్థులు కూడా హరినామ స్మరణ పట్ల ఆసక్తిని చూపుతున్నారు. దండించడానికి అతను హిరణ్య కశిపుడి తనయుడు .. అతనితో హరి నామస్మరణా మాన్పించకపోతే హిరణ్యకశిపుడు తమని దండిస్తాడు. ఏమిటి చేయడం? అని వాళ్లు సతమతమవుతుంటారు. ప్రహ్లాదుడు మాత్రం హరిభక్తిలోనే తరిస్తూ ఉంటాడు. రోజు రోజుకు ఆయనలోని హరిభక్తి ఎక్కువవుతూ ఉంటుంది.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.