Sri Bhagavatam – Hiranyakashipu proudness – punishes who chants Lord Vishnu name
బ్రహ్మదేవుడి నుంచి వరాలను పొందిన హిరణ్యకశిపుడు, వరబల గర్వితుడై మిడిసిపడుతూ ఉంటాడు. తనని జయించేవారు ముల్లోకాలలోను లేరని అహంభావిస్తాడు. నేరుగా “అమరావతి”కి వెళ్లి దేవేంద్రుడిని భయకంపితుడిని చేస్తాడు. ఇకపై అష్టదిక్పాలకులు తన ఆదేశానుసారం పనిచేయాలని చెబుతాడు. దేవతలంతా తనని పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. అందుకు విరుద్ధంగా జరిగితే, తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అంటాడు. తన అనుమతి లేకుండా ఎవరూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని హెచ్చరిస్తాడు.
ఆ తరువాత తన మంత్రిని పిలిచి తమ రాజ్యంలో కూడా ఎవరూ శ్రీహరిని కొలవరాదని చెబుతాడు. తానే దైవము .. తానే దయతలచువాడు. అందువలన దేవాలయాలలో తన విగ్రహం మాత్రమే ఉండాలి. అందరూ తనని మాత్రమే పూజించాలని అంటాడు. రాజ్యమంతటా తన నామమే మారుమ్రోగాలి .. ఎక్కడా కూడా విష్ణునామం వినిపించకూడదు. తన నిర్ణయానికి విరుద్ధంగా నడచుకున్నవారిని తగిన విధంగా శిక్షించమని చెబుతాడు. తక్షణమే తన ఆదేశాన్ని ఆచరణలో పెట్టమని అంటాడు.
హిరణ్యకశిపుడు ఆదేశానుసారమే రాజ్యంలోని ప్రజలంతా నడచుకుంటూ ఉంటారు. కొంతమంది హిరణ్యకశిపుడు దేవుడు ఎలా అవుతాడు? ఒక రాజుగా ఆయనను అంగీకరిస్తాము .. కానీ దేవుడిగా ఎలా భావిస్తాము? తమ దైవం శ్రీమన్నారాయణుడు .. ఆయనను మాత్రమే కొలుస్తాము అని అంటారు. హరినామం తప్ప తాము మరొక నామం పలకమని తమ నిరసనను వ్యక్తం చేస్తారు. అలాంటి వాళ్లందరినీ హిరణ్యకశిపుడి అనుచరులు నానా బాధలు పెడుతుంటారు. అంత బాధల్లోను వాళ్లు ఆ స్వామి నామాన్నే జపిస్తూ ఉంటారు.
హిరణ్యకశిపుడి ఆగడాలను గురించి శ్రీమహావిష్ణువుకు తెలుస్తుంది. అహంభావంతో ఆయన చేస్తున్న అరాచకాలకు త్వరలోనే స్వస్తిపలకాలని భావిస్తాడు. తన అంశతో జన్మించిన ప్రహ్లాదుడి వల్లనే హిరణ్యకశిపుడికి మనశ్శాంతి లేకుండా పోతుందనీ, అందువలన ఆయన బలహీనపడటం అప్పటి నుంచే మొదలవుతుందని భావిస్తాడు. తగిన సమయం ఆసన్నమైనప్పుడు హిరణ్యకశిపుడి సంగతి చూడవచ్చని అనుకుంటాడు. హిరణ్యకశిపుడి అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతుంటాయి. ప్రహ్లాదుడికి గురుకులానికి వెళ్లే వయసు వస్తుంది.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.