Sri Bhagavatam – Hiranyakashipu was blessed by Lord Brahma for his penance
ఒక వైపున హిరణ్యకశిపుడి తపస్సు కొనసాగుతూ ఉండగానే, మరో వైపున లీలావతి .. ప్రహ్లాదుడికి జన్మనిస్తుంది. హిరణ్యకశిపుడు తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏంకావాలో కోరుకోమని అడుగుతాడు. తనకి మరణం లేకుండగా వరం ఇవ్వమని హిరణ్యకశిపుడు కోరతాడు. మరణం అనేది ఎంతటివారికైనా తథ్యమనీ .. అందువలన ఆ వరాన్ని ఇవ్వడం కుదరదని బ్రహ్మ దేవుడు చెబుతాడు. మరేదైనా వరం కోరుకోమని అంటాడు. దాదాపు మొదటి వరానికి దగ్గరగా ఉండేలా వరం కోరుకోవడం మంచిదని హిరణ్యకశిపుడు భావిస్తాడు.
తనకి ఆకాశంలోగానీ … భూమిపై గాని .. నీటియందుగానీ .. అగ్నియందుగాని .. గాలిలోగాని మరణం ఉండకూడదని హిరణ్యకశిపుడు అంటాడు. అలాగే దేవదానవులు వలన గానీ .. మానవుల వలన గానీ మరణం సంభవించకూడదని చెబుతాడు. ఉదయం … రాత్రి వేళలో తనకి మరణం కలగకూడదని చెబుతాడు. ఎలాంటి సర్పములవలన .. జంతువుల వలన తనకి మృత్యువు అనేది ఉండకూడదని అంటాడు. అలా తనకి వరం ప్రసాదించమని హిరణ్యకశిపుడు కోరతాడు. అంతవరకూ అలాంటి వరం కోరినవారు లేరంటూ బ్రహ్మదేవుడు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే అనుగ్రహిస్తాడు.
తపస్సు పూర్తి చేసుకుని హిరణ్యకశిపుడు తిరిగివస్తాడు. ఆయన రాకపట్ల లీలావతి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. తమ బిడ్డను స్వామివారికి చూపిస్తూ మురిసిపోతుంది. ఆ పుత్రుడుని చూసుకుని ప్రహ్లాదుడు ఆనందంతో పొంగిపోతాడు. ఏ ఉద్దేశంతో అయితే తాను తపస్సును చేశాడో .. బ్రహ్మదేవుడి నుంచి వరాలను పొందాడో ముందుగా ఆ ఉద్దేశాన్ని ఆచారణలో పెట్టాలని హిరణ్యకశిపుడు నిర్ణయించుకుంటాడు. తన సోదరుడిని సంహరించిన శ్రీహరికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అనుకుంటాడు.
అలాగే తాను లేని సమయంలో తన భార్యను అవమాన పరిచిన దేవేంద్రుడి అంతు చూడాలని భావిస్తాడు. ఆ ఇంద్రుడిని సింహాసనంపై నుంచి దించేసి అవమానపరచాలని నిర్ణయించుకుంటాడు. అమరలోకంపై దండయాత్ర చేసి తన తపోబలం ఎంతటిదనేది చూపాలనుకుంటాడు. తాను ఆదేశించగానే యుద్ధానికి సిద్ధమయ్యేలా ఉండాలని తన సైన్యాధిపతికి చెబుతాడు. అలా వరబల గర్వితుడైన హిరణ్యకశిపుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిపై ఆగ్రహావేశాలతో రగిలిపోతూ, ఆయనతో యుద్ధం చేయడానికి ఆసక్తిని చూపుతుంటాడు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.