Sri Bhagavatam – Jamadagni hosted Kartaviryarjuna
కార్తవీర్యార్జునుడు తాను దత్త వ్రతం చేయడమే కాకుండా, తన రాజ్యంలోని ప్రజలంతా ఆ వ్రతం ఆచరించేలా చూస్తుంటాడు. అలా దత్త అనుగ్రహానికి ఆయన పాత్రుడవుతాడు. స్వామి సన్నిధిలో తన మనసులోని మాటను బయటపెట్టి వేయి చేతులను పొందుతాడు. తలచుకున్న వెంటనే వేయి చేతులు వచ్చి సహస్ర బాహుబలాన్ని ప్రదర్శించేలా వరాన్ని పొందుతాడు. అలా ఆయన ఒక రాజుకు ఉండవలసిన బాహుబలాన్ని సొంతం చేసుకుంటాడు .. సింహాసనాన్ని దక్కించుకుని రాజ్యాధికారాన్ని పొందుతాడు.
ఎప్పుడైతే సహస్ర బాహుబల సంపన్నుడు అవుతాడో, అప్పుడే ఆయనలో అహంభావం ప్రవేశిస్తుంది. ఆయన శౌర్య పరాక్రమాలు .. వరబలం గురించి తెలిసిన ఇతర రాజులంతా ఆయన దాసులవుతారు. బలవంతులతో చెలిమి చేయడం మంచిదనే రాజనీతి సూత్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. దాంతో కార్తవీర్యార్జునుడికి తనని ఎదుర్కొనేవారు .. జయించేవారు ఎవరూ లేరనే గర్వం మరింత పెరిగిపోతుంది. అలా అహంభావంతో మిడిసిపడుతున్న ఆయన వేటకు రావడం .. వేటలో భాగంగా అడవిలో చాలా లోపలికి వెళ్లడం .. ఆకలితో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి రావడం జరుగుతుంది.
జమదగ్ని మహర్షి ఆశ్రమంలోకి కార్తవీర్యార్జునుడు అడుగుపెడతాడు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్న జమదగ్ని మహర్షికి తనని తాను పరిచయం చేసుకుంటాడు. వేటకి వచ్చిన తాను చాలా ఆకలితో ఉన్నట్టుగా చెబుతాడు. వెంటనే తన ఆకలి తీర్చే ఏర్పాటు చేయమని కోరతాడు. ఈ విషయంలో ఎంతమాత్రం ఆలస్యం జరగకుండా చూడమని చెబుతాడు. ఆయనతో పాటు ఏవారైనా వచ్చారా? అన్ని జమదగ్ని మహర్షి అడుగుతాడు. తన పరివారమంతా తనతోనే ఉన్నారనీ, వాళ్లందరిని ఆశ్రమం బయటే ఆగమని చెప్పి లోపలికి వచ్చానని కార్తవీర్యార్జునుడు సమాధానమిస్తాడు.
అయితే వాళ్లందరినీ కూడా భోజనానికి రావలసిందిగా ఆహ్వానిస్తాననీ, అంతా కూడా తమ ఆతిథ్యం స్వీకరించి వెళ్లవచ్చని జమదగ్ని మహర్షి అంటాడు. ఆ మాటకు కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోతాడు. ఇంతమంది పరివారానికి ఎలా ఆహారాన్ని సమకూర్చుతారా అని ఆయన ఆలోచనలో పడాతాడు. కార్తవీర్యార్జునుడు కాసేపు విశ్రాంతి తీసుకోగానే భోజనాలు సిద్ధమవుతాయి. భోజనంలోకి వివిధ రకాల పదార్థాలు వడ్డించడం చూసి కార్తవీర్యార్జునుడు విస్మయానికి లోనవుతాడు. ఇంత తక్కువ సమయంలో ఇంతమందికి ఇన్ని రకాల వంటకాలు ఏర్పాటు చేయడం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Jamadagni hosted Kartaviryarjuna