Sri Bhagavatam – Jamadagni was angry on Kartaviryarjuna
జమదగ్ని మహర్షి ఆతిథ్యం స్వీకరించిన కార్తవీర్యార్జునుడు, ఇంతమందికి ఇన్నిరకాల వంటకాలు ఎలా సిద్ధం చేశారని అడుగుతాడు. ఇందులో తన గొప్పతనమేమీ లేదనీ, ఇదాంత కామధేనువు చూపిన కరుణ అని జమదగ్ని మహర్షి చెబుతాడు. ఆ కామధేనువు వల్లనే ఇంతమందికి కావాల్సిన పదార్థాలను సమకూర్చగలిగామని అంటాడు. భోజనం చేస్తున్నంత సేపూ కార్తవీర్యార్జునుడు కామధేనువును గురించే ఆలోచిస్తూ ఉంటాడు. భోజనం చేసిన తరువాత, తమకి ఇంత రుచికరమైన భోజన పదార్థాలను అందించిన కామధేనువును చూడలని ఉందని కార్తవీర్యార్జునుడు అంటాడు.
జమదగ్ని అతనిని వెంటబెట్టుకుని వెళ్లి కామధేనువును చూపుతాడు. దేవేంద్రుడు తనకి కానుకగా ఇచ్చినట్టు చెబుతాడు. కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువు వైపు ఆశగా .. ఆసక్తిగా చూస్తాడు. ఈ కామధేనువు ఉండవలసింది ఆశ్రమంలో కాదు .. తన రాజ్యంలో తన అధినంలో అంటాడు. ఆ మాట వినగానే జమదగ్ని మహర్షి ఉలిక్కిపడతాడు. ఆయన విన్నది నిజమేనని అంటాడు కార్తవీర్యార్జునుడు. కోరిన కోరికలను నెరవేర్చు కామధేనువు రాజు దగ్గర ఉండటమే శ్రేయస్కరమని అంటాడు. ఆశ్రమంలో ఉండడటం వలన కామధేనువును పరిమితంగా మాత్రమే ఉపయోగించుకున్నట్టు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.
అందువలన రాజ్య శ్రేయస్సు కోరి తాను కామధేనువును తీసుకువెళుతున్నట్టుగా చెబుతాడు. అవసరమైతే కామధేనువుకు బదులుగా లక్ష గోవులను ఇస్తానని అంటాడు. కార్తవీర్యార్జునుడి దురుద్దేశం జమదగ్ని మహర్షికి అర్థమవుతుంది. ఆయన ధోరణి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. కామధేనువుతో ఆశ్రమవాసులకు గల అనుబంధం గురించి జమదగ్ని మహర్షి చెబుతాడు. తాము దేవతలా పూజించే కామధేనువును ఇవ్వడం కుదరదని అంటాడు. ఆయనలా తేల్చిచెప్పడంతో కార్తవీర్యార్జునుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు.
రాజ్యంలో విలువైన సంపద ఎక్కడ ఉన్నా అది రాజుకే చెందుతుంది. అందువలన కామధేనువును తనకి సమర్పించడంలో ధర్మం ఉందని కార్తవీర్యుడు అంటాడు. కామధేనువు ఒక వస్తువు కాదు .. అది పవిత్రమైన ప్రదేశాలయందు .. ధర్మబద్ధమైన ఆశ్రమాలయందు మాత్రమే ఉండగలదు. అందువలన దానిని దానంగా ఇవ్వడానికి తాను సిద్ధంగాలేనని జమదగ్ని మహర్షి చెబుతాడు. అయితే దానిని బలవంతగానైనా తాను తీసుకువెళతానని కార్తవ్యుడు అంటాడు. తన భటులను పిలిచి కామధేనువును తమ రాజ్యానికి తరలించమని ఆదేశిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Jamadagni was angry on Kartaviryarjuna