కంసుడిని అంతం చేయడానికి ముందు అతని వెనుక “జరాసంధుడు” ఉన్నాడనే ఒక ఆలోచన చేసి ఉండవలసిందని జరాసంధుడు కృష్ణుడితో అంటాడు. తన జోలికి .. తనవారి జోలికి వచ్చిన వాళ్లను జరాసంధుడు అంత తేలికగా వదిలిపెట్టడనే విషయమైనా తెలుసుకుని ఉండవలసిందని చెబుతాడు. మహావీరులతో యుద్ధం చేయడం అంటే, మడుగులోని పాము తోక పట్టుకుని ఆడించడం కాదనే విషయం గ్రహించాలని అంటాడు. యుద్ధం అంటే గోపాలకులతో కలిసి ఆడుకునే ఆటకాదని ఎద్దేవా చేస్తాడు.
తనని ఒక సాధారణ గోపాలకుడిగా తలచినప్పుడు .. తనకి యుద్ధంపై అవగాహనే లేదని అనుకున్నప్పుడు వందలాది సైన్యాన్ని వెంటేసుకుని రావడం ఎందుకని కృష్ణుడు జరాసంధుడిని అడుగుతాడు. ఓ గోపాలకుడిని అంతం చేయడానికి ఆయన ఇంతమందిని వెంటేసుకుని ఇంత దూరం రావడమే తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటాడు. శత్రువు గురించిన చరిత్రను తెలుసుకుని, ఆ శత్రువుకు శత్రువులైనవారితో చేతులు కలిపి తోడు తెచ్చుకోవడం కూడా తనకి తెలియదని చెబుతాడు. కృష్ణుడు ఆ మాట అనగానే జరాసంధుడు ఆగ్రహానికి లోనవుతాడు.
తన అల్లుడి మరణానికి కారకుడు .. తన కూతుళ్ల వైధవ్యానికి కారకుడు ఎదురుగా నిలబడితే మాటలతో పొద్దుపుచ్చడం అనవసరమని చెప్పేసి తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. జరాసంధుడు ఆదేశించగానే ఆయన సైన్యం ముందుకు కదులుతుంది. ఏనుగుల ఘీంకారాలతో .. గుర్రాల సకిలింతలతో .. రథాల చప్పుళ్లతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతుంది. బలరామకృష్ణులు శత్రువులపై బాణాల వర్షం కురిపిస్తూ ఉంటారు. అవతల వైపు నుంచి దూసుకువస్తున్న బాణాలకి మధుర సైనికులు కూడా నేల కూలుతూనే ఉంటారు.
అలా పోరు భీకరంగా జరుగుతూ ఉంటుంది .. బలరామకృష్ణులు ముందుగా జరాసంధుడి సైన్యాన్ని నడిపిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని బాణాలను సంధిస్తారు. నాయకులు లేని సైన్యం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. బలరామకృష్ణులు వదిలే బాణాలు తుమ్మెదల్లా ముసురుకుంటూ ఉండటంతో, ఆ సైనికులు కుప్పలుగా నేలకొరుగుతుంటారు. తన సైన్యం పలచబడుతూ ఉండటంతో జరాసంధుడు డీలాపడిపోతాడు. ఆయనలోని ధైర్యసాహసాలు ఎప్పుడైతే సన్నగిల్లాయో అప్పుడు బలరాముడు విరుచుకుపడతాడు. కానీ కృష్ణుడి సూచనమేరకు వదిలేస్తాడు. ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయిన జరాసంధుడు వెనుదిరిగి వెళ్లిపోతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.