కచుడు తనకి విధించిన శాపం గురించి యయాతితో దేవయాని చెప్పడం మొదలుపెడుతుంది. దేవతలు .. దానవుల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధంలో దానవులు మరణించగానే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు “మృత సంజీవిని” విద్యచే వాళ్లను తిరిగి బ్రతికిస్తుంటాడు. దానవుల సంఖ్య ఎంతమాత్రం తగ్గకపోవడంతో, దేవతలకు యుద్ధం చేయడం కష్టమవుతూ ఉంటుంది. దాంతో ఏం చేయాలా అని దేవతలంతా కూడా ఆలోచనలో పడతారు. తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పమని బృహస్పతిని కోరతారు. ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు.
బృహస్పతి తన కుమారుడైన “కచుడు”ని పిలిచి, యుద్ధంలో మరణిస్తున్న దానవులను శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యచే తిరిగి బ్రతికిస్తున్నాడు. ఆ మంత్రం ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు. ఆ మంత్రం ఆయన దగ్గర ఉన్నంత వరకూ దానవులను .. దేవతలు ఎదుర్కోవడం కష్టమే. కనుక .. శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి ఆయన శిష్యరికం చేయమని చెబుతాడు. ఆయన దగ్గర ఆ మృత సంజీవిని మంత్రం నేర్చుకుని వస్తే, అది తమని కూడా రక్షిస్తూ ఉంటుందని అంటాడు. శుక్రాచార్యుడి మనసు గెలుచుకోవడమే కష్టమైన పని .. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపిస్తాడు.
శుక్రాచార్యుడి మందిరానికి చేరుకున్న కచుడు .. ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చానని చెబుతాడు. ఆయన వినయవిధేయతలు నచ్చడం వలన అందుకు శుక్రాచార్యుడు అంగీకరిస్తాడు. ఆ రోజు నుంచి శుక్రాచార్యుడి సేవలు చేస్తూ ఆయన ప్రియ శిష్యుడిగా మారిపోతాడు. కచుడు మంచి అందగాడు కావడం వలన .. ఆయన ప్రవర్తన నచ్చడం వలన .. ఆయనపై శుక్రాచార్యుడి కూతురైన దేవయాని మనసు పారేసుకుంటుంది. అప్పటి నుంచి ఆమె ప్రత్యేకమైన అభిమానంతో ఆయనను చూడటం మొదలుపెడుతుంది.
శుక్రాచార్యుడి దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు .. వాళ్లంతా చాలాకాలం నుంచి ఆయన సేవలో ఉంటారు. అయితే కొత్తగా వచ్చిన కచుడు మంచిపేరు తెచ్చుకోవడం వాళ్లకి ఈర్ష్య కలిగిస్తుంది. తమకంటే వెనక వచ్చి .. తమని దాటేసి గురువుగారి మనసులో కచుడు స్థానాన్ని సంపాదించుకోవడం వాళ్లు తట్టుకోలేకపోతారు. కచుడికే గురువుగారు అన్ని పనులను అప్పగిస్తూ ఉండటం వాళ్లు భరించలేకపోతారు. కచుడిని అడ్డుతప్పించడమే మంచిదనే నిర్ణయానికి వస్తారు. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనను ఆచరణలో పెడతారు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.