Kanchipuram – Sri Kamakshi Aman Temple
ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనేక రూపాలను .. నామాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. కంచి కామాక్షి .. మధుర మీనాక్షి .. బెజవాడ కనకదుర్గమ్మ అంటూ భక్తులు ఆ తల్లిని పిలుచుకుంటూ .. కొలుచుకుంటూ ఉంటారు. అలాంటి అమ్మవార్లలో కామాక్షి అమ్మవారి విషయానికే వస్తే, భక్తుల కొంగుబంగారంగా ఆ తల్లి కొలువై దర్శనమిస్తుంది. తమిళ భక్తులు “కామాక్షి అమ్మన్” అని పిలుచుకునే ఈ క్షేత్రం తమిళనాడులోని “కాంచీపురం”లో(Kanchipuram) వెలుగొందుతూ ఉంటుంది. కంటిచూపులతోనే తన భక్తులను అనుగ్రహించే కారణంగానే ఆ తల్లిని కామాక్షిగా స్మరిస్తూ ఉంటారు.
కంచిలో పృథ్వీలింగం దర్శనమిస్తుంది .. కామాక్షిదేవి కొలువై కనిపిస్తుంది. పంచభూతలింగాలలో ఒకటి .. శక్తి పీఠాలలో ఒకటిగా ఈ క్షేత్రం మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. అంతేకాదు కంచి అంతటా కూడా అనేక ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. శైవ .. వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన గోపురాలు .. పొడవైన ప్రాకారాలు .. మంటపాలు .. కోనేర్లతో ఈ క్షేత్రం ప్రాచీన వైభవానికి అద్దం పడుతున్నట్టుగా ఉంటుంది.
గర్భాలయంలో అమ్మవారు చతుర్భుజాలతో .. పద్మాసనంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారి పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఆ విశ్వంలో ఎక్కడ ఉన్నా ఆ తల్లి తన కళ్లను అటు .. ఇటు కదిలిస్తూనే తన భక్తులకు కావలసిన రక్షణను ఇస్తుందని చెప్పడానికి అనేక కథలు .. సంఘటనలు వినిపిస్తాయి. ఒకసారి లక్ష్మీదేవి సరదాగా శ్రీమహావిష్ణువుతో పరిహాసం ఆడటం వలన, ఆమెలో కళ తగ్గిపోయిందట. అప్పుడు కంచి కామాక్షి సన్నిధిలోని కుంకుమ తీసుకుని లక్ష్మీదేవిపై చల్లడం వలన, తిరిగి ఆ తల్లికి ఆ కళ వచ్చిందనే ఒక కథనం ఇక్కడ వినిపిస్తుంది.
ఇక అలాగే ఇక్కడ “అభిరామ భట్టారకుడు” అనే భక్తుడు .. అనునిత్యం ఆ తల్లి నామాన్ని స్మరిస్తూ .. ధ్యానంలో ఆ తల్లి రూపాన్ని దర్శిస్తూ ఉండేవాడట. ఒకసారి ఆ ప్రాంతాన్ని ఏలే మహారాజు ఆ వీధిలో వెళుతూ, ఒక అరుగుపై కూర్చున్న అభిరాముడిని చూశారు. తనని చూసి కూడా అహంభావం వల్లనే నిలబడలేదని రాజుగారికి కోపం వచ్చేసింది. కంగారు పడిపోయిన అక్కడివారు, అతనికి మతిస్థిమితం లేదని అబద్ధం చెబుతారు. ఆ మాటలు రాజుగారు నమ్మలేదు. ఆ రాజు ఆయన దగ్గరికి వెళ్లి పిలవగానే .. అభిరాముడు ధ్యానంలో నుంచి బయటికి వస్తాడు.
ఆ రోజు తిథి ఏమిటి అని రాజుగారు అడగ్గానే .. అసలు బయట ఏం జరిగిందో తెలియని అభిరాముడు “పౌర్ణమి” అని చెప్పేశాడు. ఆ రోజున అమావాస్య కావడంతో, అభిరాముడు వంకరగా సమాధానమిచ్చాడని రాజుగారు భావిస్తాడు. అయితే తాను రాత్రికి వస్తాననీ .. ఆకాశంలో పౌర్ణమి చంద్రుడిని చూపించాలనీ, లేదంటే తగిన శిక్ష తప్పదని రాజుగారు వెళ్లిపోతాడు . ఆ తరువాత జరిగింది తెలుసుకున్న అభిరాముడు .. కామాక్షి అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తాడు. రాజు గారు వచ్చే సమయానికి ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు కనిపిస్తాడు.
ఇక మూక శంకరుల వారు ఇక్కడి అమ్మవారి దర్శన భాగ్యం వలన ఆ తల్లిని చేసిన స్తుతినే “మూక పంచశతి”గా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి అద్భుతమైన సంఘటనలు జరిగిన ప్రదేశంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. అమ్మవారు ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై ఉందనడానికి ఇలా అనేక నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. ఆది శంకరులవారు ఇక్కడ శ్రీ చక్రం స్థాపించారు. తమిళ మాసాల ప్రకారం ఇక్కడ జరిగే ఉత్సవాలు .. ప్రత్యేక సేవలను దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించదగిన క్షేత్రాలలో ఇది ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Kanchipuram – Sri Kamakshi Aman Temple