రోజులు గడుస్తున్నా కొద్దీ కంసుడు తీవ్రమైన ఆందోళనకు .. అసహనానికి లోనవుతుంటాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎంతమంది అసురులను పంపించినా ప్రయోజనం లేకుండగా పోవడంతో దిగాలు పడిపోతుంటాడు. ఎలాగైనా ఆ కృష్ణుడిని అంతం చేయాలి? తాను బలహీన పడుతున్న కొద్దీ ఆ కృష్ణుడు బలపడుతున్నాడు. తాను నిరాశకి లోనవుతుంటే, అతను రెట్టించిన ఉత్సాహాన్ని పొందుతున్నాడు. ఇక అతనికి ఆ ఆనందం మిగలకూడదు .. అందుకోసం ఏం చేయాలి? తాను అనుకున్నది సాధించడానికి ఏ దారిలో వెళ్లాలి? అనే ఆలోచన చేస్తాడు.
అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తాడు. కంసుడి యోగ క్షేమాలను గురించి అడుగుతాడు. కంసుడు అదోలా ఉండటం గమనించి విషయమేమిటని ఏమీ తెలియని వాడిలా ప్రశ్నిస్తాడు. తన శత్రువును గురించిన ఆలోచనలతో తాను సతమతమవుతున్నానని కంసుడు అంటాడు. కృష్ణుడి విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదనీ, అతను దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించినవాడేనని నారద మహర్షి చెబుతాడు. ప్రస్తుతం కృష్ణుడు “బృందావనం”లో ఉన్నాడనే విషయం కూడా చెప్పేస్తాడు.
కృష్ణుడి విషయంలో తన అనుమానం నిజమేనని తెలియగానే కంసుడు మరింత ఆగ్రహావేశాలకు లోనవుతాడు. వసుదేవుడు – దేవకీదేవిలను మరింతగా బాధలకు గురిచేయమని భటులను ఆదేశిస్తాడు. కంసుడు అలా కోపంతో మండిపోతూ ఉండటంతో, ఇక తాను వచ్చిన పని పూర్తయినందుకు నారద మహర్షి నెమ్మదిగా జారుకుంటాడు. ఇక కంసుడు మృత్యువును వెతుక్కుంటూ వెళ్లడమే ఆలస్యం అనుకుంటూ వెళ్లిపోతాడు. నారద మహర్షి వెళ్లిన తరువాత కంసుడు మరింత ఆలోచనలో పడతాడు.
ఇంతవరకూ తాను శత్రువును వెదుకుతూ వెళ్లి సంహరించి రమ్మని అసురులను పంపుతూ వచ్చాను. వెళ్లినవాళ్లు వెళ్లినట్టుగానే కృష్ణుడి చేతిలో హతమయ్యారు. స్థానం బలం కారణంగా కృష్ణుడు ఎప్పుడూ కూడా గెలుస్తూనే వస్తున్నాడు. అందువలన ఈ సారి అతన్నే “మధుర”కు రప్పించాలి. తన రాజ్యంలో .. తన సమక్షంలోనే అతను అంతం కావాలి. తన రాజ్యంలో .. తన అనుచరులు ఇంతమంది ఉండగా ఆ కృష్ణుడు తనని ఏమీ చేయలేడు. తన రాజ్యంలో తనని ఎదిరించి నిలిచి బతికి బట్టకట్టినవారు లేరు. కృష్ణుడి విషయంలోనూ అదే జరగాలి అనే నిర్ణయానికి వస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.