కృష్ణుడిని ఒక పథకం ప్రకారం అంతమొందించాలి .. ఈ సారి తన ప్రయత్నం వృథా కాకూడదు. అంచెల పద్ధతిలో మహా వీరులను .. యోధులను ఉంచాలి. అవసరమైనప్పుడు క్షణాల్లో వాళ్లు రంగంలోకి దిగాలి. తన కనుసైగ కోసం వాళ్లంతా కాచుకుని ఉండాలి. మహావీరులకు లొంగని పక్షంలో ఏనుగును కూడా సిద్ధంగా ఉంచాలి. ఇలా పకడ్బందీగా తన వ్యూహంలో నుంచి కృష్ణుడు తప్పించుకోకుండా చేయాలి. మరణానికి ముందు అతను ఉక్కిరిబిక్కిరి కావాలి. అలా జరగాలంటే అతను “మధుర” రావాలి.
కానీ కృష్ణుడు ఎందుకు “మధుర” వస్తాడు? .. ఏ కారణం చేత అతణ్ణి మధురకు రప్పించాలి? ఇంతమంది అసురుల మాయలను గ్రహించిన కృష్ణుడు సామాన్యుడు కాడనే విషయం అర్థమవుతూనే ఉంది. అలాంటివాడిని మాయమాటలతో కాకుండా మంచి మాటలతోనే “మధుర”కు రప్పించాలి. కృష్ణుడు నమ్మేలా అతనికి మాయ మాటలు చెప్పేవారెవరూ? ఎవరు చెబితే కృష్ణుడు నమ్మేసి వెంటవస్తాడు? అనే ఆలోచన రాగానే ఆయనకి “అక్రూరుడు” గుర్తుకు వస్తాడు.అవును “అక్రూరుడు” అంటే అందరికీ గౌరవమే. అందువలన ఆయనను పంపించడమే సరైనది అనుకుని కబురు చేస్తాడు.
కంసుడు కబురు చేయగానే “అక్రూరుడు” అక్కడికి చేరుకుంటాడు. తనని ఉన్నపళంగా రమ్మని కబురు చేయడానికి కారణమేమిటని అడుగుతాడు. తనని హతమార్చడం కోసమే జన్మించిన కృష్ణుడు “బృందావనం”లో ఉన్నట్టుగా తనకి తెలిసిందనీ, తాను “ధనుర్యాగం” చేస్తున్నట్టుగా చెప్పి, ఆ వేడుకను తిలకించడానికిగాను అతణ్ణి “మధుర”కు తీసుకురమ్మని చెబుతాడు. తనని సంహరించడం కోసం పుట్టిన కృష్ణుడి మరణానికి తానే ముహూర్తం పెట్టానని అంటాడు. “మధుర”కు వచ్చిన అతను ఎలాంటి పరిస్థితుల్లోను తిరిగి వెళ్లడని అంటాడు.
మంచి మాటలతో కృష్ణుడిని ఒప్పించి “మధుర”కు తీసుకువచ్చే బాధ్యత తనదేననే విషయం అక్రూరుడికి అర్థమైపోతుంది. కంసుడి ఉద్దేశం నచ్చకపోయినా, పరమాత్ముడైన కృష్ణుడి దర్శనం ఈ విధంగా కలుగుతున్నందుకు “అక్రూరుడు” ఆనందంతో పొంగిపోతాడు. కంసుడి ఆదేశం మేరకు రథంపై “బృందావనం” బయల్దేరతాడు. అతని రథం కనుమరుగయ్యేవరకూ కంసుడు చూస్తాడు. అతను తప్పకుండా కృష్ణుడిని తీసుకురాగల సమర్థుడు .. అందువలన తన ఏర్పాట్లలో తాను ఉండాలని భావిస్తాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.