కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం చేసి, ఆ తరువాత ఉపవాస దీక్షను చేపట్టి దేవతార్చన చేయాలి. ఆ రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయంలో ఆవునెయ్యితోగానీ .. నువ్వుల నూనెతో గాని .. ఆముదంతోగాని దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన శివలోక ప్రాప్తి కలుగుతుంది అని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠ మహర్షి, అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు.

పూర్వం పాంచాలదేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. భార్య అంటే ఆయనికి అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సంతాన లేమి వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది. తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్లు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ల దగ్గరికి “పిప్పల మహర్షి” వస్తాడు. మహారాజు – మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు.

కార్తీక వ్రతం ఆచరించడం వలన, సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరతాయని పిప్పల మహర్షి చెబుతాడు. దాంతో ఆయన చెప్పినట్టుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగశిశువు జన్మిస్తాడు. తమ కోరిక నెరవేరినందుకు .. తమ కల నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు “శత్రుజిత్తు” అని నామకరణం చేస్తారు. మహారాజు .. మహారాణి ఇద్దరూ కూడా ఆ శిశువును ఎంతో గారాబంగా పెంచుతారు.

సంపదలకు కొదవ లేకుండా పోవడంతో, శత్రుజిత్తు ఏ లోటూ తెలియకుండా ఎదుగుతాడు. యవ్వనంలోకి అడుగుపెడతాడు. తల్లిదండ్రులు చేసిన గారం .. అంతులేని సంపదలు .. యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయడంతో, పరస్త్రీ వ్యామోహనానికి లోనవుతాడు. శత్రుజిత్తు ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేక పోతారు. దాంతో ఆయన ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.

శత్రుజిత్తు తాను ఏది అనుకున్నాడో అది చేసేస్తూ ఉంటాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి శత్రుజిత్తు కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది .. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూపలావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు. ఆమె అందచందాలే ఆయన కళ్లముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ, తన సిరిసంపదలు .. అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు.

శత్రుజిత్తు అంతటి గొప్ప వ్యక్తి తనని ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వ పడుతుంది. అంతటి సిరిసంపదలు కలిగిన వ్యక్తి తనని ఆరాధించడం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు .. అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకి ఆయనతో చనువుగా మసలుకుంటూ ఉంటుంది. శత్రుజిత్తు యువరాజు కావడం వలన, ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణం అవుతుంది. క్రమంగా ఆమెకి తన భర్తపట్ల ప్రేమ తగ్గుతూ .. యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది.

తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం, ఆనోటా ఈనోటా ఆ బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. నిజంగా అది ఆయనకి చాలా అవమానంగా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతుంటాడు. నిప్పులేనిదే పొగరాదని తెలిసినప్పటికీ, తన కళ్లతో చూసిన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియడంతో, ఆ ఇద్దరినీ అంతమొందించాలనే నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురుచూస్తూ ఉంటాడు.

ఆ రోజున కార్తీక పౌర్ణమి .. పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయంలో కలుసుకోవాలని శత్రుజిత్తు .. ఆమె నిర్ణయించుకుంటారు. తమని ఎవరూ చూడటం లేదనే నిర్ధారణకి వచ్చిన తరువాత ఎవరి ఇళ్లలో నుంచి వారు బయటపడతారు. శిథిలమైన శివాలయం దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరూ కలిసి లోపలికి అడుగుపెడతారు. శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు గనుక, యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు. దీపం వెలిగించేందుకు ఇద్దరూ ప్రమిద కోసం వెతుకుతారు.

యువరాజు .. ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర చెంగు చివరలు చింపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకుని సంతోషంతో పొంగిపోతారు .. ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను .. యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు, ఆవేశంతో కత్తి తీసుకుని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్లపై దాడిచేసి హతమారుస్తాడు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు.

బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య .. యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ల ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివ భటులు .. యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను .. యువరాజు ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయల్దేరతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు.

తాను ఎంతో నియమనిష్టలతో జీవించాననీ, అలాంటి తనని యమలోకానికి తీసుకువెళ్లడం ఏమిటని యమభటులను నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందనీ .. ఆ యువరాజు సిరిసంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు. వాళ్లిద్దరూ ధర్మం తప్పారని చెబుతాడు. అలాంటివారిని శివలోకానికి తీసుకుని వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తాడు. చెడుదారిలో వెళుతున్నవారిని శిక్షించడం తప్పేలా అవుతుందని అడుగుతాడు.

ఆ రోజున కార్తీక పౌర్ణమి .. పైగా సోమవారం. అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్లిద్దరూ శివాలయానికి వచ్చారు .. గర్భాలయంలో దీపం పెట్టారు. ఆ పుణ్యం కారణంగా వాళ్లని శివలోకానికి తీసుకువెళుతున్నట్టుగా శివభటులు చెబుతారు. శివాలయంలో దీపం వెలిగించినవారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్లడానికి కారణమైందని అంటారు. దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తాను ధర్మం అనుకున్నది అధర్మం అపోయిందేనని చింతిస్తాడు.

అప్పటివరకూ వాళ్ల మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణుడి ఉద్దేశం ఏదైనప్పటికీ, మేము శివలోకానికి వెళ్లే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు. అలాంటి ఆయన మా కళ్ల ముందే నరకానికి వెళ్లడం మాకు మరింత బాధను కలిగించే విషయం. అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకెళ్లే మార్గమేదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు. అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక మాట చెబుతారు.

కార్తీక మాసంలో .. పౌర్ణమి రోజున .. సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరూ శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు. వాళ్లు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తే, ఆయన కూడా శివలోకానికి వెళ్లడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెబుతారు. ఆ మాట వినగానే శత్రుజిత్తు .. ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు.

శివాలయంలో ప్రమిదలో నూనె పోసిన పుణ్యం తాను .. చీర చెంగు చింపి వత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామనీ, ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తామని యువరాజు అంటాడు. ఆయన చెప్పినది సరైనదిగానే శివభటులకు అనిపిస్తుంది. దాంతో అందుకు వాళ్లు అంగీకరిస్తారు. అప్పుడు యువరాజు .. ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకి ధారపోస్తారు. అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుడిని శివభటులకు అప్పగించి వెళ్లిపోతారు. అలా ఆ ముగ్గురూ కూడా శివలోకానికి చేరుకుంటారు.

రాజా .. కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించడం వలన ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో విన్నావు కదా. కార్తీకంలో సాయంత్రం వేళ శివాలయంలోగానీ .. విష్ణు ఆలయంలోగాని తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. అలా దీపారాధన చేయడం వలన కలిగే పుణ్యం .. సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది. పుణ్యరాశిని పెంచేసి ఉత్తమ లోకాలకు మార్గాన్ని చూపుతుంది. అందువలన కార్తీకంలో గుడిలో దీపం వెలిగించడం మరిచిపోవద్దు అని సెలవిస్తాడు.

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.