పారిజాత వృక్షాన్ని భూలోకానికి తరలించడానికి ప్రయత్నిస్తున్న శ్రీకృష్ణుడిపై దేవేంద్రుడు మండిపడతాడు. క్షీరసాగర మథనంలో తమకి లభించిన పారిజాత వృక్షాన్ని దొంగచాటుగా తరలించడం భావ్యం కాదని చెబుతాడు. నరకాసురుడి బారి నుంచి దేవలోకాన్ని కాపాడిన కృష్ణుడు, అదే దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని అనుమతి లేకుండా తీసుకెళ్లడానికి ప్రయత్నించడం లోకులు మెచ్చరని అంటాడు. గతంలో అతని నుంచి సాయాన్ని పొందిన కారణంగా, అతను ఏం చేసినా మౌనంగా ఉంటానని అనుకోవడం అవివేకమని చెబుతాడు.

పారిజాత వృక్షాన్ని కదిలించాలనే ఆలోచనను మానుకుని వెళ్లడం మంచిదని కృష్ణుడితో దేవేంద్రుడు అంటాడు. పారిజాత వృక్షాన్ని తెస్తాననీ .. ఇస్తానని తాను సత్యభామకు మాట ఇచ్చానని కృష్ణుడు అంటాడు. ఇప్పుడు ఆ ఆలోచనను మానుకోవడం వీర పురుషుల లక్షణం కాదని చెబుతాడు. పారిజాత వృక్షాన్ని తీసుకువెళ్లాలనేదే చివరి నిర్ణయమైతే, ముందుగా వజ్రాయుధాన్ని ఎదిరించి అందుకు సిద్ధపడమని అంటూ దేవేంద్రుడు అడ్డుకుంటాడు.

దేవేంద్రుడి చేతిలోని వజ్రాయుధాన్ని చూసిన కృష్ణుడు చిరుమందహాసం చేస్తాడు. తాను పారిజాత వృక్షాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటే, ఆపడం ఎవరివలనా కాదని కృష్ణుడు అంటాడు. వజ్రాయుధాన్ని తనపై ప్రయోగించి చూడమని చెప్పేసి కృష్ణుడు తన పనిలో నిమగ్నమవుతాడు. పారిజాత వృక్షాన్ని తీసుకెళుతున్న కృష్ణుడిపై దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అది ఆయనపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది. ఇంద్రాది దేవతలు కూడా ఈ విషయంలో కృష్ణుడిని ఎదిరించలేకపోతారు.

దేవలోకం నుంచి తీసుకొచ్చిన పారిజాత వృక్షాన్ని భూలోకంలోని సత్యభామకు సంబంధించిన ఉద్యానవనంలో నాటతాడు కృష్ణుడు. తన కోసం కృష్ణుడు నేరుగా దేవలోకానికి వెళ్లడం .. ఇంద్రాది దేవతలను జయించి పారిజాత వృక్షాన్ని తీసుకురావడం .. తన ఉద్యానవనంలో దానిని స్థాపించి తన ముచ్చట తీర్చడం సత్యభామకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దాంతో అష్టభార్యలలో తన స్థానం ప్రత్యేకమనీ .. ఆ విషయంలో తనకి ఎలాంటి సందేహం అవసరం లేదని ఆమె భావిస్తుంది. ఆ పారిజాతవృక్షాన్ని అనునిత్యం పూజిస్తూ .. వాటితో కృష్ణుడిని సేవిస్తూ ఉంటుంది.

గమనిక : భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.