శ్రీకృష్ణుడు .. “శోణపురము”లో బందీగా ఉన్న తన మనవడైన అనిరుద్ధుడిని విడిపించడానికి బయల్దేరతాడు. బలరాముడు .. ప్రద్యుమ్నుడు తమ సైనిక సమూహంతో కృష్ణుడిని అనుసరిస్తారు. కృష్ణుడు తనపైకి యుద్ధానికి వస్తున్నాడనే విషయం బాణాసురుడికి తెలుస్తుంది. వెంటనే ఆయన తన కోట వాకిట ఉన్న శివుడిని కలుసుకుని ఆ విషయం చెబుతాడు. తన తరఫున కృష్ణుడితో యుద్ధం చేయమని కోరతాడు .. అందుకు శివుడు అంగీకరిస్తాడు. ఇక ఆందోళన చెందవలసిన పని లేదనుకుంటూ బాణాసురుడు తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు.
కృష్ణుడు .. తన సైన్యంతో శోణపురము చేరుకుంటాడు. అక్కడ శివుడు నిలిచి ఉండటం చూసి, బాణాసురుడి తరపున యుద్ధం చేసేది శివుడేనని ఆయనకి అర్థమైపోతుంది. ఒక అసురుడికి అలాంటి వరం ఇవ్వడం సరైనది కాదని కృష్ణుడు అంటాడు. భక్తులు ఎవరైనా తనని శరణు కోరితే కాదనలేనని శంకరుడు చెబుతాడు. దాంతో వాళ్లిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. హరిహరులిద్దరూ హోరాహోరీగా పోరాటం చేస్తుంటారు. దాంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతుంటాయి.ఇంద్రాదిదేవతలు .. మహర్షులు అంతా కూడా ఈ యుద్ధాన్ని ఆపడం ఎలా అని ఆలోచన చేస్తుంటారు.
శివుడిపై కృష్ణుడు “సమ్మోహనాస్త్రం” ప్రయోగిస్తాడు. దాంతో శివుడు లిప్తకాలం పాటు స్తబ్దతకి లోనవుతాడు. అది గ్రహించిన బాణాసురుడు వెంటనే రంగంలోకి దిగుతాడు. తనపై శివుడినే యుద్ధానికి దింపిన బాణాసురుడిపై కృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. తపస్సు ద్వారా తాను సంపాదించుకున్న అన్నిరకాల అస్త్రాలను బాణాసురుడు ప్రయోగిస్తాడు. కానీ వాటిని చేదించుకుంటూ వెళ్లిన సుదర్శన చక్రం, అతని బాహువులను ఖండిస్తుంది. కేవలం అతనికి అవసరమైన భుజబలాన్ని మాత్రమే కృష్ణుడు మిగుల్చుతాడు.
బాహుబల గర్వంతో .. వరబల గర్వంతో అప్పటివరకూ మిడిసిపడిన బాణాసురుడికి, అహంభావమనే పొరలు తొలగిపోతాయి. అప్పుడు శివకేశవులు ఇద్దరూ ఒక్కటేననే విషయం ఆయనకి బోధపడుతుంది. దాంతో తనని మన్నించమని కృష్ణుడిని కోరతాడు. తన భక్తుడిని అనుగ్రహించమని శివుడు కూడా తన మాటగా చెబుతాడు. గతంలో ప్రహ్లాదుడికి ఇచ్చిన మాటనే బాణాసురుడిని రక్షించిందని శివుడితో చెబుతాడు కృష్ణుడు. బాణాసురుడు మనసు మార్చుకుని, అనిరుద్ధిడితో పాటు తన కూతురైన ఉషను కూడా కృష్ణుడికి అప్పగిస్తాడు. ఆ జంటను తీసుకుని కృష్ణుడు ద్వారకకి బయల్దేరుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.