యశోదాదేవి వచ్చిందని తెలియగానే కృష్ణుడి అష్ట భార్యలు అక్కడికి వస్తారు. వాళ్లంతా కూడా వినయ విధేయతలతో ఆమెకి నమస్కరించుకుంటారు. పేరు పేరునా వాళ్లందరినీ దేవకీదేవి పరిచయం చేస్తుంది. అందరినీ కూడా యశోదా దేవి ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. అంతటి అందమైన .. గుణవంతులైన భార్యలు లభించడం తన కృష్ణుడి అదృష్టమని అంటుంది. ఆ మాటలకు వాళ్లంతా కూడా సంతోషపడతారు. కృష్ణుడికి ఏయే వంటకాలంటే ఎక్కువ ఇష్టమనేది వాళ్లందరికీ యశోదా చెబుతుంది.
కృష్ణుడు ఎంతటి ఘనకార్యాలు చేసినా ఆయన మనసు చాలా సున్నితమైనదనీ, ఎలాంటి పరిస్థితుల్లోను ఆయన మనసుకు కష్టాన్ని కలిగించేలా ప్రవర్తించవద్దని కోరుతుంది. ఇప్పటికీ కృష్ణయ్యలో కొన్ని అల్లరి వేషాలు ఉన్నాయనీ, వాటివలన ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ ఉండదనీ, అందువలన ఎవరూ ఆయనను నిందించే ప్రయత్నం చేయకూడదని చెబుతుంది. తనకంటే ఎక్కువగా వాళ్లంతా ఆయనను చూసుకుంటారని నమ్మకం ఉందని అంటుంది. వాళ్లంతా కృష్ణుడితో కలిసి కళకళలాడుతూ కనిపిస్తుంటే, తనకి కనుల పండుగా ఉందని చెబుతుంది.
అయితే కృష్ణుడితో వాళ్ల వివాహ వేడుకను చూడలేకపోయినందుకు బాధగా ఉందని అంటుంది. ఒక్క వివాహ వేడుకకు కూడా తనని ఆహ్వానించకపోవడం గురించి ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆయన వివాహ వేడుకను చూడాలని తాను ఎన్నో కలలు కన్నాననీ, కానీ తన కోరిక నెరవేరకుండానే పోయిందని బాధపడుతుంది. పరిస్థితుల ప్రభావం కారణంగా తాను చెప్పలేకపోయాననీ, ఈ విషయంలో తనని క్షమించమని కృష్ణుడు కోరతాడు. క్రితం జన్మలో “ధరాదేవి”గా ఆమె ఉన్నప్పుడు ఇచ్చిన మాట కారణంగానే, బాల్యం వరకూ ఆమె దగ్గర పెరిగినట్టుగా చెబుతాడు.
తన కల్యాణాన్ని చూడలేకపోయినందుకు ఎంతమాత్రం బాధ పడవద్దనీ, ఆమె కోరికను తప్పక నెరవేరుస్తానని చెబుతాడు. తన వివాహాన్ని ఆమె తప్పక చూస్తుందనీ, తన వివాహం జరగడానికి కూడా ఆమెనే కారకురాలవుతుందని అంటాడు. కలియుగంలో తాను వేంకటేశ్వరస్వామిగా అవతరిస్తాననీ, ఆమె “వకుళమాత”గా జన్మిస్తుందని చెబుతాడు. ఆమెను వెతుక్కుంటూ తాను వస్తాననీ, ఆమెతో పాటే ఉంటానని అంటాడు. అప్పుడు తన కల్యాణం జరగడంలో ఆమెనే ప్రధానమైన పాత్రను పోషిస్తుందని చెబుతాడు. ఆ మాటకు యశోదాదేవి ఎంతగానో సంతోష పడిపోతుంది .. మరెంతగానో మురిసిపోతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.