సుధాముడిని ఒక ఎత్తైన ఆసనంపై కూర్చోబెట్టిన కృష్ణుడు, ఆయన పాదాలను కడిగి పూజిస్తాడు. అష్టభార్యలు అక్కడ ఉండగా, కృష్ణుడు తన పాదాలను కడగడం సుధాముడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాము విద్యాభ్యాసం చేసిన రోజులను .. అప్పుడు తాము చనువుగా గడిపిన క్షణాలను .. ఒకరి కోసం ఒకరు చేసిన త్యాగాలను గురించి కృష్ణుడు తన పరివారంతో చెబుతుంటే సుధాముడు ఆశ్చర్యపోతాడు. ఆ విషయాలన్నీ కృష్ణుడు గుర్తుపెట్టుకున్నందుకు సుధాముడి కళ్లు చెమ్మగిల్లుతాయి.

ఆ తరువాత కృష్ణుడు .. సుధాముడికి ఇష్టమైన వంటకాలతో విందును ఏర్పాటు చేస్తాడు. రకరకాల పిండివంటలు .. భోజన పదార్థాలు .. పండ్లతో ఘనమైన విందు ఏర్పాట్లను చూసిన సుధాముడు, తన విషయంలో కృష్ణుడు చూపుతున్న శ్రద్ధకు పొంగిపోతాడు. అయితే ఆ పదార్థాలను చూడగానే, ఇంటి దగ్గర ఆకలితో ఉన్న తన భార్యాబిడ్డలు ఆయనకు గుర్తుకు వస్తారు. తన కన్నీళ్లు కృష్ణుడి కంటపడకుండా చూసుకుంటాడు. సుధాముడి పక్కనే కూర్చుని ఆయనకి కావలసిన పదార్థాలను కృష్ణుడు కొసరి కొసరి వడ్డిస్తాడు.

ఆ తరువాత సుధాముడి దగ్గరే ఉండి ఆయనను విశ్రాంతి మందిరానికి తీసుకువెళతాడు. విశ్రాంతి మందిరంలో పట్టు పాన్పులపై సుధాముడు నడుం వాల్చుతాడు. ఆయనకి ఏదో లోకంలోకి తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది కలా? నిజమా? అనుకుంటాడు. తనని కృష్ణుడు ఇంతగొప్పగా చూశాడని చెబితే తన భార్య నమ్ముతుందో లేదో, ఆమెను కూడా వెంటతీసుకువస్తే బాగుండేదని అనుకుంటాడు. తన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి ఉంటుందని తాను కలలో కూడా అనుకోలేదకుంటూ ఆనందానికి లోనవుతాడు.

ఆ తరువాత సుధాముడు ఇక తన ఊరికి బయల్దేరతానని కృష్ణుడితో చెబుతాడు. కృష్ణుడు తన అష్ట భార్యలతో కలిసి సత్కరిస్తాడు. నూతన వస్త్రాలను అందజేస్తాడు. ఆ సమయంలోనే సుధాముడి భుజంపై వ్రేలాడుతున్న తువ్వాలు మూట గట్టి ఉండటం చూస్తాడు. తన కోసం ఏదో తెచ్చావే అంటూ, ఆ మూట అందుకుని విప్పుతాడు. కృష్ణుడి భార్యలు చూసి ఏమనుకుంటారోనని సుధాముడు ఇబ్బందిపడతాడు. ఆ మూటలోని అటుకులను కృష్ణుడు ఎంతో ఇష్టంగా తింటాడు. ఆ తరువాత ఆయనను గుమ్మం వరకూ వచ్చి సాగనంపుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.