నరకాసురుడు మరణించడంతో లోకులంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్న తమకి కృష్ణుడి కారణంగా విముక్తి కలిగినందుకు ఆనందిస్తారు. ఇక తమ జీవితంలో నుంచి కష్టాలు .. భయాలు .. చీకట్లు తొలగిపోయాయని భావించి ఆనందోత్సాహాలతో మతాబాలు కాలుస్తారు. ఊరూరా సంతోషాలు పొంగుతాయి .. సంబరాలు జరుగుతాయి. తమకి ఇంతటి స్వేచ్ఛను కల్పించిన శ్రీకృష్ణ సత్యభామలకు అందరూ కూడా మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

నరకాసురుడిని సంహరించిన తరువాత ఆయన చెరసాలలో ఉన్న సాధువులను .. మునులను .. మహర్షులతో పాటు 16 వేలమంది కన్యలను కృష్ణుడు విడుదల చేస్తాడు. వాళ్లంతా కూడా చాలా కాలం తరువాత విముక్తి కలగడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కృష్ణుడి పట్ల తమకి గల ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తారు. ఆయనను విడిచి తాము క్షణమైనా ఉండలేమనే విషయాన్ని బలంగా చెబుతారు. వాళ్ల ముచ్చట తీర్చడం కోసం కృష్ణుడు వాళ్లందరినీ వరిస్తాడు. వాళ్లంతా నివసించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయిస్తాడు.

ఇలా ఒక వైపున అష్టభార్యల ముచ్చట తీరుస్తూనే, మరో వైపున 16 వేలమంది కన్యలతోను ఒకే సమయంలో ముచ్చట్లాడుతూ ఆయన అవతార పురుషుడు అనే విషయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాడు. అలా కృష్ణుడు అష్టభార్యాలతోను .. 16 వేల మంది కన్యలతోను ఆనందంగా కాలం గడుపుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఓ రోజున నారద మహర్షి .. ద్వారక చేరుకుంటాడు. ఆయనను కృష్ణుడు సాదరంగా ఆహ్వానిస్తాడు. తాను అమరలోకం నుంచి వస్తున్నట్టుగా నారద మహర్షి చెప్పడంతో, అక్కడి సంగతులేమిటని అడుగుతాడు.

నరకాసురుడు మరణించడంతో దేవేంద్రుడు తిరిగి తన పదవిని అలంకరించినట్టుగా నారదుడు చెబుతాడు. అమరలోక వాసులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారని అంటాడు. తమ సంతోషానికి కారకుడైన కృష్ణుడి పట్ల అందరూ కృతజ్ఞతా భావంతో ఉన్నారని చెబుతాడు. అమరలోకం నుంచి తాను వస్తున్నప్పుడు శచీదేవి తనకి ఒక పారిజాత పుష్పాన్ని ఇచ్చిందని అంటాడు. ఆ పారిజాత పరిమళం దేవలోకమంతా వ్యాపించి అక్కడి వాళ్ల మనసులను ఆహ్లాదపరుస్తోందని చెబుతూ, దానిని కృష్ణుడికి అందజేస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.