ఒక వైపున కృష్ణుడికి ఎదురవుతున్న ఆపదలతో .. మరో వైపున కృష్ణుడు చేస్తున్న అల్లరి పనులతో యశోదాదేవి సతమతమైపోతుంటుంది. .. ఇంకొక వైపున తమ ఇంట్లో వెన్న దొంగతనం చేస్తున్నాడనే ఫిర్యాదులు కొట్టిపారేయడంలోనే ఆమె సమయమంతా గడిచిపోతుంటుంది. దాంతో కృష్ణుడు ఏం చేస్తున్నాడో ఏమిటో ఒక కంట కనిపెడుతూ తనకి చెప్పమని బలరాముడికి చెబుతుంది. అప్పటి నుంచి బలరాముడు .. ఒక వైపున కృష్ణుడితో కలిసి ఆడిపాడుతూనే, మరో కంట అతణ్ణి కనిపెడుతూ ఉంటాడు.

అలా ఒకసారి అంతా కలిసి ఆడుకుంటూ ఉండగా, కృష్ణుడు మట్టితింటూ ఉండటాన్ని బలరాముడు చూస్తాడు. మన్ను తినకూడదని కృష్ణుడితో చెబుతాడు. అయినా కృష్ణుడు వినిపించుకోకుండా మన్ను తింటూ ఉండటంతో పరుగున వెళ్లి యశోదాదేవికి చెబుతాడు. వెంటనే ఆమె అక్కడికి చేరుకుని, మన్ను తినడం పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది. కృష్ణుడు తాను మన్ను తినలేదు అన్నట్టుగా తలను అడ్డంగా ఆడిస్తాడు. కృష్ణుడు మన్ను తినడం తాను చూశాననీ, అబద్ధం చెబుతున్నాడని బలరాముడు అంటాడు.

దాంతో నోరు తెరిచి చూపించమని యశోదాదేవి అడుగుతుంది. ముందుగా మారం చేసిన కృష్ణుడు, తల్లి వత్తిడి చేయడంతో నోరు తెరుస్తాడు. కృష్ణుడి నోట్లో అనంతమైన విశ్వం .. అందులోని సమస్త జీవరాశి .. సముద్రాలు .. అడవులు .. పర్వతాలు చూసి యశోదాదేవి ఆశ్చర్యపోతుంది. అవతార పురుషులను .. వాళ్ల లీలా విశేషాలను చూసి తన కళ్లను తానే నమ్మలేకపోతుంది. బాలకుడైన కృష్ణయ్య నోటిలో అవతార పురుషులు కనిపించడం ఆమెకి చిత్రంగా అనిపిస్తుంది. పిల్లాడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతుంది.

చిన్నికృష్ణుడు మాత్రం తనకేమీ తెలియదన్నట్టుగా తన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఆవులు .. ఆటలు .. పాటలు .. ఇవే ఆయన లోకమైపోతాయి. ముఖ్యంగా ఆలమందలను తోలుకెళ్లి అక్కడ వాటితో గడపడం .. పిల్లన గ్రోవిని సమ్మోహనకరంగా వాయిస్తూ తన స్నేహితులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆయన పిల్లనగ్రోవి వాయించే తీరుకు పశువులు .. పక్షులు కూడా సమ్మోహనాన్ని పొందుతూ ఉంటాయి. అలా గోకులంలో అంతా కూడా సంతోషాలతో .. సంబరాలతో కాలం గడుపుతుంటారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.