సత్యభామ ముచ్చటపడిన విధంగానే “నందన ఉద్యానవనం”లోని పారిజాత వృక్షాన్ని పెకిలించడానికి కృష్ణుడు సిద్ధపడతాడు. అది చూసిన కాపలాదారులు పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఆ పారిజాత వృక్షం “శచీదేవి”కి ప్రాణ సమానమనీ, దానిని పెకిలించే ప్రయత్నాలు మానుకోమని కోరతారు. ఈ విషయం తెలిస్తే శచీదేవి చాలా బాధపడతారనీ, వృక్షాన్ని దూరం నుంచి తిలకిస్తూ ఆనందించమని అంటారు. తాము దేవలోకానికి వచ్చిందే ఆ వృక్షం కోసమనీ, అందువలన తమ పనికి అడ్డుపడొద్దని సత్యభామ అసహనాన్ని ప్రదర్శిస్తుంది.
పారిజాతవృక్షాన్ని తాకడానికి ప్రయత్నిస్తే దేవేంద్రుడు సహించడనీ, అలాంటిది దానిని పెకిలించడానికి ప్రయత్నిస్తే ఆయన ఆగ్రహావేశాలను అదుపుచేయడం కష్టమని కాపలాదారులు చెబుతారు. అలాంటి దేవేంద్రుడిని నరకాసురుడి బారి నుంచి కాపాడిందే కృష్ణుడనీ, అందువలన దేవేంద్రుడికి భయపడవలసిన అవసరం లేదని సత్యభామ సమాధానం చెబుతుంది. దాంతో కాపలాదారులు నేరుగా వెళ్లి, ఈ విషయాన్ని దేవేంద్రుడికి చెబుతారు. ఆ మాట వినగానే ఆయన ఉలిక్కిపడతాడు. శచీదేవి తీవ్రమైన ఆందోళనకు లోనవుతుంది.
కృష్ణుడు .. సత్యభామ కలిసి పారిజాత వృక్షాన్ని పెకిలించి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే దేవేంద్రుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు. అతిథులుగా వచ్చి .. పారిజాత వృక్షమును అపహరించుకుని వెళ్లాలనే ఆలోచన చేయడం పట్ల ఆయన ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. దేవలోకం రాక్షసుల కారణంగా ఆపదలో పడినప్పుడు కాపాడిన కృష్ణుడే ఇలా చేయడానికి ప్రయత్నించడం పట్ల శచీదేవి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. సత్యభామ రాకలోని ఆంతర్యం ఇదనే విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని అంటుంది.
పారిజాత వృక్షం లభించినది మొదలు తాను దానిని ఎంతో అపురూపంగా చూస్తుకుంటున్నానని దేవేంద్రుడితో శచీదేవి చెబుతుంది. అలాంటి పారిజాత వృక్షం నందనవనంలో లేకపోతే తాను చూడలేనని ఆవేదన చెందుతుంది. ఆ పారిజాత వృక్షాన్ని కాపాడవలసిన బాధ్యత దేవేంద్రుడిపై ఉందని అంటుంది. దాంతో ఆ వృక్షమును కాపాడుకోలేకపోతే తన భార్య శచీదేవికి తీరని వేదనను మిగిల్చినవాడినవుతానని దేవేంద్రుడు భావిస్తాడు. తన వజ్రాయుధాన్ని చేబట్టి క్షణాల్లో నందన ఉద్యానవనం చేరుకుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
