కృష్ణుడిని కలుసుకుని తన పేదరికం గురించి చెప్పుకుని .. ఆయన సహాయాన్ని కోరాలనే ఉద్దేశంతో సుధాముడు ద్వారక బయల్దేరతాడు. కాలి నడకన బయల్దేరిన ఆయన కొన్ని రోజుల తరువాత ద్వారక చేరుకుంటాడు. అప్పటికే ఆయన బాగా అలసిపోతాడు. కృష్ణుడి గురించి ద్వారకవాసులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటే పొంగిపోతాడు. కృష్ణుడి నివాసభవనం దగ్గరికి చేరుకుని, ఒక చూపుకు అందని ఆ భవనాల సముదాయాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. తనలాంటి వాడికి అసలు ప్రవేశం ఉంటుందా? అనే అనుమానం ఆయనకి మొదటిసారిగా కలుగుతుంది.

కాపలా భటుల దగ్గరికి వెళ్లిన సుధాముడు, తాను కృష్ణుడి బాల్యస్నేహితుడని చెబుతాడు. ఆయనను కలుసుకోవడానికి చాలా దూరం నుంచి వచ్చానని అంటాడు. సుధాముడు మాసిపోయిన వస్త్రాలతో .. బక్క చిక్కిన శరీరంతో ఉండటం చూసిన భటులు, ఆయన మాటల పట్ల అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. అబద్ధాలు చెప్పేసి లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే శిక్ష పడుతుందనీ, వచ్చిన దారినే వెళ్లడం మంచిదని భటులు హెచ్చరిస్తారు. ఒకసారి కలిసి వెళతానని చెప్పినా వాళ్లు వినిపించుకోరు. అదే సమయంలో భటులను వారిస్తూ కృష్ణుడు అక్కడికి వస్తాడు.

కృష్ణుడిని చూడగానే సుధాముడు సంతోషంతో పొంగిపోతాడు. ఆయనని కృష్ణుడు ఆత్మీయంగా లోపలికి ఆహ్వానిస్తాడు. కృష్ణుడు ఎప్పుడూ ఎవరితోనూ అంత చనువుగా ఉండటం చూడని కాపలాదారులు ఆశ్చర్యపోతుంటారు. కృష్ణుడు సుధాముడిని వెంటబెట్టుకుని నేరుగా తన అంతఃపురానికి తీసుకెళతాడు. విలాసవంతమైన ఆ భవనాలు .. అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పాలు .. విశాలమైన ప్రాంగణాలు .. ఉద్యానవనాలు ఇవన్నీ చూస్తూ సుధాముడు విస్మయానికి లోనవుతాడు. తన స్నేహితుడు అనుభవిస్తున్న వైభవానికి మనసులోనే ఆనందిస్తాడు.

సుధాముడిని తన మందిరానికి తీసుకెళ్లిన కృష్ణుడు, ఆయనను తన అష్టభార్యలకు పరిచయం చేస్తాడు. తన వస్త్రాలు .. వాలకం చూసుకున్న సుధాముడు తాను రాకుండా ఉంటేనే బాగుండేదేమో అనుకుంటాడు. తన వలన కృష్ణుడికి గౌరవం ఏమైనా తగ్గుతుందేమోనని బాధపడతాడు. తాను కృష్ణుడిని ఇబ్బంది పెట్టానేమోనని భావిస్తాడు. తన భుజాన వ్రేళ్లాడుతున్న అటుకుల మూటను అందరూ చూస్తున్నారనుకుని, అది వాళ్ల కంటపడకుండా దాచడానికి ప్రయత్నిస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.