బలరామకృష్ణులు రాజవీధిలో నడుస్తూ ఉండగా, వాళ్లకి కురూపి అయిన “కుబ్జ” ఎదురుగా వస్తుంది. వివిధ రకాల లేపనాలతో ఆమె బలరామకృష్ణుల దగ్గరికి చేరుకుంటుంది. అనేక వంకరలు తిరిగిన శరీరం .. ముడతలు పడిన ముఖంతో ఉన్న “కుబ్జ”ను కృష్ణుడు పరిశీలనగా చూస్తాడు. తాను కంసుడి దాసీగా పనిచేస్తూ ఉంటానని “కుబ్జ” పరిచయం చేసుకుంటుంది. సుగంధాలను వెదజల్లే లేపనాలు తయారు చేయడంలో తనకి ఎంతో నైపుణ్యం ఉందని చెబుతుంది. కంసుడికి పరిమళ ద్రవ్యాలను తయారుచేస్తూ ఉంటానని అంటుంది.

బలరామకృష్ణుల సేవ కోసం కంసుడు తనని నియమించాడని “కుబ్జ” చెబుతుంది. తన చేతి లేపనం వెదజల్లే పరిమళాన్ని ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేరని అంటూ, తాను తెచ్చిన లేపనాలు బలరామకృష్ణులకు అందిస్తుంది. ఆ సుగంధ పరిమళాలను అందుకున్న బలరామకృష్ణులు, ఆమె నైపుణ్యానికి ఆశ్చర్యపోతారు. నిజంగానే అలాంటి పరిమళాలను తాము ఎప్పుడూ ఆస్వాదించలేదని అంటారు. ఆమె సిద్ధం చేసిన లేపనాలకంటే, ఆత్మీయతతో ఆమె అందించిన తీరు నచ్చిందని చెబుతారు.

అద్భుతమైన లేపనాలను తయారు చేసే తన పనితనాన్ని బలరామకృష్ణులు మెచ్చుకోవడం “కుబ్జ”కు ఆనందాన్ని కలిగిస్తుంది. అందవిహీనంగా ఉండటం వలన తనని అంతా ఎగతాళి చేసేవారేగానీ, ఎవరూ ఎప్పుడూ మెచ్చుకోలేదని ఆమె బాధపడుతుంది. భగవంతుడు ఇన్ని వంకరాలతో పుట్టించడం తన దురదృష్టమనీ, పుట్టుకతో వచ్చిన వంకరలు .. మధ్యలో ఎలా పోతాయని విచారాన్ని వ్యక్తం చేస్తుంది. ఆమె ఆవేదనను కృష్ణుడు అర్థం చేసుకుంటాడు. ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ శరీరాన్ని నిమురుతాడు.

అంతే ఆ క్షణంలోనే “కుబ్జ” వంకరలు పూర్తిగా పోతాయి. నాజూకుదనంతో కూడిన లావణ్యరాశిగా ఆమె మారిపోతుంది. తన రూపంలో హఠాత్తుగా వచ్చిన మార్పును చూసుకుని ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తనని సౌందర్యరాశిగా మార్చిన కృష్ణుడి పాదాలపై వాలిపోతుంది. కృష్ణుడు ఆమెను మెల్లగా పైకి ఎత్తి .. ఇకపై ఆమెకి ఎలాంటి అవమానాలు ఎదురుకావని అంటాడు. ఆనంద బాష్పాలు వర్షిస్తున్న కళ్లతో ఆమె బలరామకృష్ణులకు నమస్కరిస్తుంది. అక్కడి నుంచి వాళ్లు ముందుకు కదులుతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.