శ్రీమన్నారాయణుడికి తెలియనిది లేదు .. అయినా ఆయన ధృవుడికి బాధ కలిగించిన విషయాన్ని ఆయన నోటి ద్వారానే వింటాడు. ఆయన ఏదైతే ఆశించి తపస్సు చేశాడో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని చెబుతాడు. ఆయన తపస్సు తనని కదిలించి వేసిందనీ, అందుకే తండ్రి తొడపైనే కాకుండా విశ్వంలోని “ధృవ మండలం”లో ఆయనకి చోటు లభించేలా చేస్తున్నట్టుగా చెబుతాడు. ఈ కారణంగా ఆయన కీర్తి ఆ చంద్రతారార్కం నిలిచి ఉంటుందని అంటాడు. ఇది అతి తక్కువమందికి లభించే అరుదైన స్థానం అని చెబుతాడు.
ఆ మాట వినగానే ధృవుడు స్వామివారికి మరోసారి నమస్కరిస్తాడు. అయితే ముందుగా నగరానికి తిరిగి వెళ్లమని విష్ణుమూర్తి చెబుతాడు. రానున్న కాలంలో అతని పిన్ని అడవిలోని దావాగ్నిలో చిక్కుకుని మరణిస్తుందనీ, ఆయన తమ్ముడు ఉత్తముడు కూడా ఓ యుద్ధంలో మరణిస్తాడని అంటాడు. అందువలన అతనే సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన సాగించవలసి వస్తుందనీ. శరీరాన్ని వదిలివేసిన తరువాత ధృవ మండలం చేరుకోగలవని చెప్పేసి అదృశ్యమవుతాడు.
ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి సంతోషిస్తాడు. తన సలహాను అక్షరాలా పాటించి, శ్రీమహా విష్ణువు మనసును ధృవుడు గెలుచుకోవడం ఆయనకు ఆ ఆనందాన్ని కలిగిస్తుంది. వెంటనే ఆయన ముందుగా ధృవుడి తండ్రి అయిన ఉత్తానపాదుడిని కలుసుకుంటాడు. ఉత్తానపాదుడిలో మునుపటి తేజస్సు లేకపోవడం చూసి, ఏమీ తెలియనివాడిలా విషయమేమిటని అడుగుతాడు. ఇంతకుముందు ఆయనను ఎప్పుడూ అలా చూడలేదని అంటాడు. ఆరోగ్యం బాగానే ఉంది కదా అంటూ ఆయన కళ్లలోకి చూస్తాడు.
ఆ మాటలకు ఉత్తానపాదుడు దీర్ఘంగా నిట్టూర్చుతాడు. తన ఆనందం .. సంతోషం .. తేజస్సు తన కుమారుడు ధృవుడితోనే పోయాయని ఆయన అంటాడు. తపస్సు చేయడానికి అడవులకు వెళ్లాడని తెలిసిన దగ్గర నుంచి తన మనసు మనసులో లేదని చెబుతాడు. అడవిలో ఎలాంటి మృగాలు ఉంటాయో తెలియని తన కుమారుడు తిరిగి వస్తాడనే నమ్మకం తనకి లేదంటూ విచారాన్ని వ్యక్తం చేస్తాడు. సురుచి ప్రవర్తనకు భయపడి తాను ధృవుడి మనసును కష్టపెట్టి చాలా తప్పుచేశానని ఆవేదన చెందుతాడు. ధృవుడు లేని రాజ్యము .. సుఖాలు .. భోగాలు తనకి అవసరం లేదని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.