Sri Bhagavatam – Lord Vishnu born to Aditi as child

శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం కాగానే “అదితి” ఆనందంతో పొంగిపోతుంది. తన వ్రతం పూర్తి కాగానే అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతుంది. తన సంతానమైన దేవతలను అమరావతి నుంచి దానవులు తరిమివేశారని అదితి చెబుతుంది. తన కుమారుడైన ఇంద్రుడు .. కోడలు శచీదేవి .. తన మనవలు అంతా కూడా అడవులపాలయ్యారని ఆవేదన చెందుతుంది. అసురులకు భయపడుతూ వాళ్లంతా అడవుల్లో తలదాచుకోవడం తాను తట్టుకోలేకపోతున్నానని అంటుంది.

దేవతలు అమరావతికి దూరమై చాలాకాలమైందనీ, బాధలను ఓర్చుకుంటూ వాళ్లంతా కూడా రోజులు గడుపుతున్నారని అంటుంది. అమృతం దక్కిందన్న మాటేగాని దాని వలన దేవతలకు సంతోషం దక్కిందన్నది లేదని వాపోతుంది. కారడవులలో వాళ్లంతా కష్టాలు పడుతుంటే ఒక తల్లిగా తనకి కంటిపై కునుకు ఎలా పడుతుందని అడుగుతుంది. దేవతలకు పూర్వ వైభవం రావాలి .. స్వర్గ సుఖాలు దక్కాలి. వాళ్ల సంతోషాన్ని కోరుకునే తాను ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా చెబుతుంది.

“అదితి” ఆవేదనను విష్ణుమూర్తి అర్థం చేసుకుంటాడు. దానవులను హతమార్చకుండానే వాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని విష్ణుమూర్తి అంటాడు. బలిచక్రవర్తి ఆధీనంలో ఉన్న అమరావతిని దేవతలకి అప్పగించే బాధ్యత తనదని చెబుతాడు. అడవులలో అవస్థలు పడుతున్న దేవతలు త్వరలోనే అమరావతికి చేరుకునేలా చేస్తానని అంటాడు. అయితే అలా జరగాలంటే తాను ఆమె గర్భాన జన్మించవలసి ఉంటుందని చెబుతాడు. సాక్షాత్తు జగన్నాథుడు తన బిడ్డగా జన్మిస్తానంటే, అంతకు మించిన ఆనందం ఏముంటుందని అదితి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.

“అదితి” చేసిన వ్రతం ఫలించడం .. శ్రీమన్నారాయణుడి దర్శన భాగ్యం ఆమెకి లభించడం .. ఆమె కోరికను స్వామి మన్నించడం .. ఆమె గర్భాన జన్మిస్తానని కోరడం .. కశ్యప ప్రజాపతికి సంతోషాన్ని కలిగిస్తాయి. తమ జన్మ చరితార్థమైందని ఆయన ఆమెతో అంటాడు. స్వామి తమ తనయుడిగా జన్మించే సమయం కోసం వాళ్లంతా ఎంతో ఆసక్తితో .. ఆనందంతో ఎదురుచూస్తూ ఉంటారు. ఒక శుభముహూర్తాన స్వామి అదితి గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆమె బిడ్డగా జన్మిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.