Mallam Subramanya Swamy Temple

సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాలలో “మల్లామ్”(Mallam) ఒకటిగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ .. నెల్లూరు జిల్లా .. చిట్టుమూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడ స్వామివారు శ్రీవల్లీ – దేవసేన సమేతంగా దర్శనమిస్తుంటాడు. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి కూడా లోక కల్యాణం కోసం అనేకమంది అసురులను సంహరించాడు. ఆ పాపాల నుంచి విముక్తి కోసం స్వామి ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని స్థలపురాణం చెబుతోంది.

స్వామివారు ఇక్కడ వెలుగులోకి రావడానికి కారణం “పాండ్య భూపతి” అని చెబుతారు. ఒక రోజున ఆయన తన సైన్యంతో కలిసి రాజ్యానికి తిరిగివస్తూ .. ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో విశ్రమించాడు. ఆ సమయంలో అక్కడ వెదురు బొంగులు కనిపించడంతో .. పల్లకీకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో .. వాటిని నరకమని భటులను ఆదేశించాడట. భటులు ఆ వెదురు బొంగులను నరుకుతూ ఉండగా .. వారి కత్తులకు రక్తం అంటింది. దాంతో వాళ్లు కంగారు పడిపోయి, అక్కడ ఏముందా అని చూశారు.

ఆ పొదలో చేతులు నరకబడిన సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని చూసి భయపడిపోయారు. వెంటనే ఆ విషయాన్ని రాజుగారికి చెప్పారు. తన కారణంగానే ఇలా జరిగినందుకు రాజు బాధపడుతూ .. ఆలోచన చేస్తూ అంతఃపురానికి చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆయన స్వప్నంలో సుబ్రహ్మణ్యస్వామి కనిపించాడు. తాను వెలుగు చూసిన ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించి .. నిత్యపూజలు జరిగేలా చూడమని ఆదేశించాడట. దాంతో ఆ మరుసటి రోజునే రాజుగారు ఆ ప్రదేశానికి చేరుకుని ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేశాడు.

అలా 6వ శతాబ్దం నుంచి ఇక్కడ స్వామివారికి నిత్యపూజలు జరగడం మొదలైంది. ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులంతా ఈ క్షేత్రానికి ప్రాధాన్యతనిచ్చి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. పూర్వం మల్లాసురుడు అనే అసురుడు సాధుసజ్జనులను హింసిస్తూ ఉండేవాడు. దాంతో దేవతలంతా సుబ్రహ్మణ్యస్వామికి తమ గోడు చెప్పుకుంటారు. పరిస్థితిని అర్థం చేసుకున్న సుబ్రహ్మణ్యుడు, మల్లా సురుడిని సంహరించడానికి సిద్ధపడతాడు. చివరి క్షణంలో మల్లా సురుడు మనసు మార్చుకోవడంతో స్వామి మన్నిస్తాడు .. అతని పేరుతోనే ఆ క్షేత్రం పిలవబడుతుందని అనుగ్రహిస్తాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి “మల్లామ్”(Mallam) అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు.

ఇక్కడి ఆలయం … ఉపాలయాలు .. మంటపాలు .. శిల్పకళ చూసితీరవలసిందే. ఈ క్షేత్ర దర్శనం వలన వ్యాధులు .. బాధలు .. సర్పదోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. ప్రతి ఏటా భాద్రపద శుద్ధ దశమి నుంచి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆయా వాహన సేవల్లో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని ధన్యులవుతుంటారు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Mallam Subramanya Swamy Temple