Mantralayam – Sri Raghavendra Swamy Temple
మంత్రాలయం(Mantralayam) అనగానే తుంగభద్ర తీరం .. శ్రీరాఘవేంద్రస్వామి(Sri Raghavendra Swamy) దివ్యమంగళ స్వరూపం కనులముందు సాక్షాత్కరిస్తుంది. ద్వైత సిద్ధాంతాన్ని .. మధ్వ సంప్రదాయాన్ని జనంలోకి తీసుకుని వెళ్లిన మహానుభావులు ఆయన. అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలు అడుగడుగునా వెదజల్లినవారాయన. ఆయన “మంచాల” గ్రామానికి చేరుకోవడానికి ముందు .. సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించకముందు జీవితాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఆ సందర్భాల్లో ఆయన చూపిన మహిమలను గురించి తెలుసుకున్నప్పుడు మనసు పులకరించకమానదు.
శ్రీ రాఘవేంద్రస్వామి(Sri Raghavendra Swamy) పూర్వనామం వేంకటనాథుడు. క్రీ.శ.1592లో మృగశిర నక్షత్ర ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం రోజున జన్మించారు. ఆయన తల్లితండ్రులు తిమ్మన భట్టు .. గోపికాంబ. వెంకటనాథుడు కంటే ముందుగానే ఆ దంపతులకు గురురాజు .. వెంకమాంబ జన్మించారు. ఆ తరువాత తమకి మరో పుత్రుడు కావాలని ఆ దంపతులు తిరుమల వేంకటేశ్వరస్వామిని కోరితే, వారికి పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తున్నట్టుగా స్వప్నంలో స్వామి చెప్పారు. అందువల్లనే ఆ కుర్రవాడికి వేంకటనాథుడు అనే నామకరణం చేశారు.
వేంకటనాథుడికి చిన్నప్పటి నుంచి వీణ వాయించడం .. గ్రంథపఠనం అంటే ఇష్టం. భగవంతుడి పట్ల అపారమైన భక్తి ఉండేవి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పుయిన వెంకటనాథుడు అన్నగారింట ఉంటూ .. అక్కాబావల సహకారాన్ని అందుకుంటూ కొంతవరకూ విద్యాభాసం చేశారు. ఆ తరువాత “కుంభకోణం” వెళ్లి “సుధీంద్ర తీర్థుల” ఆశ్రమానికి చేరుకుని అక్కడ విద్యాభ్యాసం చేయడం మొదలుపెట్టారు. అనతికాలంలోనే ఆయన గురువు మనసు గెలుచుకున్నారు. ఆ తర్వాత “సరస్వతి” అనే ఒక యువతిని వివాహం చేసుకున్నారు. వారి సంతానమే లక్ష్మీనారాయణాచార్య.
లక్ష్మీనారాయణాచార్య చిన్నప్పుడే సుధీంద్ర తీర్థులవారి కోరికమేరకు .. సరస్వతీదేవి సూచన మేరకు వెంకటనాథుడు సన్యాసం స్వీకరించాడు. రాఘవేంద్ర తీర్థులు అనేది ఆయన ఆశ్రమనామం అయింది. ఇక అప్పటి నుంచి ఆయన అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ .. అనేక మహిమలు చూపారు. రాఘవేంద్రుడికి ఎంతోమంది శిష్యులు .. మరెంతోమంది భక్తులు ఏర్పడుతూ వచ్చారు. ఆదోని నవాబు నుంచి “మంచాల” గ్రామాన్ని కానుకగా స్వీకరించిన రాఘవేంద్రుడు అక్కడే జీవ సమాధి పొందాలని నిర్ణయించుకున్నారు. ఆ బాధ్యతను వెంకన్న అనే భక్తుడికి అప్పగించారు.
“మంచాల” .. తాను ప్రహ్లాదుడిగా ఉన్నప్పుడు యజ్ఞయాగాలు చేసిన ప్రదేశమనీ .. అది సీతారాములు నడయాడిన పుణ్యభూమి అనీ .. అందుకే తాను అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లను ప్రత్యంక్షంగా చూపించారు. 1671 ఆగస్టు నెలలో .. అంటే శావాహన శకం .. విరోధికృత నామ సంవత్సరం .. శ్రావణ బహుళ విదియ .. శుక్రవారం రోజున స్వామివారు బృందావన ప్రవేశం చేశారు.
జీవసమాధి అనంతరం కూడా ఆయన తన భక్తులకు దర్శనమిచ్చారు. 800 ఏళ్లపాటు భక్తులపై తన అనుగ్రహం ఉంటుందని చెప్పారు. స్వామి బృందావన ప్రవేశం చేసిన రోజుల్లో ఇప్పటికీ ప్రతిఏటా స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రాఘవేంద్రస్వామి దర్శనంతో సమస్త పాపాలు .. దోషాలు .. భయాలు .. వ్యాధులు .. బాధలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. రాఘవేంద్రస్వామి జీవితాన్ని గురించి తెలుసుకుంటే, మంత్రాలయ దర్శనం చేయకుండా ఉండటం ఎవరివల్లా కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Mantralayam – Sri Raghavendra Swamy Temple