భూలోకంలో నరకాసురుడి ఆగడాలకు అడ్డుకట్టలేకుండా పోతుంది. ఎవరూ యజ్ఞయాగాదులు నిర్వహించరాదని ఆయన ప్రకటిస్తాడు. అంతేకాదు .. ఎవరూ కూడా హరినామ స్మరణ చేయరాదనే శాసనం చేస్తాడు. తన ఆదేశాలను వ్యతిరేకించిన వారిని చెరసాలలో వేయిస్తుంటాడు. తన శాసనాలను ధిక్కరించినవారిని చిత్రహింసలకు గురిచేస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో ఉంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని అంతా భయపడుతూ ఉంటారు. చాలామంది ఆ రాజ్యం నుంచి బయటపడటమే మంచిదనే ఉద్దేశంతో, అక్కడి నుంచి ఇతర రాజ్యాలకు వెళ్లిపోతుంటారు.

నరకాసురుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కృష్ణుడు భావిస్తాడు. ముందుగా నారద మహర్షితో శాంతివచనాలు చెప్పించాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా నారద మహర్షిని నరకాసురుడి దగ్గరికి పంపిస్తాడు. నారద మహర్షి వెళ్లి .. ఇకనైనా దుర్మార్గాలు ఆపమని కృష్ణుడి మాటగా చెబుతాడు. లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని కృష్ణుడు అన్నట్టుగా విన్నవిస్తాడు. ఆ మాటలకు నరకాసురుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. ముందుగా కృష్ణుడిని సేవించేవారి సంగతి చూడమనీ, ఆ తరువాత కృష్ణుడి అంతు చూద్దామని తన పరివారాన్ని ఆదేశిస్తాడు.

దాంతో ఒక్కసారిగా నరకాసురిడి అనుచరులు ఆశ్రమాలపై విరుచుకుపడతారు. కృష్ణుడిని ఆరాధించేవారిని హింసించడం మొదలుపెడతారు. ఆశ్రమంలో దైవనామస్మరణ చేస్తూ ఉండవలసిన మునులు .. మహర్షులు అంతా కూడా నరకాసురిడి చెరసాలలోకి చేరుతుంటారు. నరకాసురిడి అనుచరుల నుంచి తప్పించుకున్నవారిలో కొందరు “ద్వారక” చేరుకుంటారు. నరకాసురిడి అరాచకాలు మితిమీరిపోయాయని కన్నీళ్లు పెట్టుకుంటారు. తమని కాపాడమని కృష్ణుడిని వేడుకుంటారు. సామాన్య మానవులు బ్రతికే పరిస్థితిని కల్పించమని కోరతారు.

అదే సమయంలో దేవమాత అయిన “అదితి” కూడా కృష్ణుడి దగ్గరికి వస్తుంది. అమరలోక పరిస్థితిని గురించి అతనికి వివరిస్తుంది. తన కుండలాలను బలవంతంగా లాక్కుని నరకాసురుడు తనకి చేసిన అవమానం గురించి చెబుతుంది. సాక్షాత్తు దేవేంద్రుడికే దిక్కులేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని అడుగుతుంది. వెంటనే నరకాసురుడి దారుణాలకు స్వస్తి పలకమని కోరుతుంది. అతని చెరసాలలో మగ్గుతున్న వేలాదిమందికి విముక్తిని కలిగించమని కోరుతుంది. దేవమాత స్వయంగా వచ్చి కోరడంతో, ఇక ఆలస్యం చేయడం సరికాదని కృష్ణుడు భావిస్తాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.