ముచుకుందుడు సూర్యవంశానికి చెందినవాడు .. మహాపరాక్రమవంతుడు. మాంధాత కుమారుడైన ముచుకుందుడిని యుద్ధంలో గెలవడం సాధ్యం కాదు. వందలాది సైన్యాన్ని మట్టుపెట్టగల సమర్థుడు ఆయన. కదన రంగాన మహామహావీరులు సైతం ఆయన ఎదురుగా నిలబడలేరు .. ఆయన ధాటికి తట్టుకోలేరు. అందువల్లనే దేవతలు సైతం ఆయన సహాయాన్ని కోరతారు. దీనిని బట్టి ఆయన ఏ స్థాయి పరాక్రమవంతుడనేది అర్థం చేసుకోవచ్చును.
ఒకసారి దేవదానవుల మధ్య పోరు భీకరంగా జరుగుతూ ఉంటుంది. దేవతలను జయించే పరిస్థితికి దానవులు చేరుకుంటారు. అలాంటి సమయంలోనే వాళ్లంతా ముచుకుందుడి సహాయాన్ని కోరతారు. దాంతో ఆయన దేవతల పక్షాన అసురులతో పోరాడతాడు. ముచుకుందుడు యుద్ధరంగాన నిలిచిన తొలిరోజునే ఆయన ఎంతటి పరాక్రమవంతుడు అనేది దానవులకు అర్థమవుతుంది. అసురులు ఆయన ధాటికి నిలువలేక తమ ప్రాణాలను ఆయన ఆయుధాలకు అప్పగించేస్తారు. అలా దేవతలు విజయం సాధించడంలో ముచుకుందుడు ప్రధానమైన పాత్రను పోషిస్తాడు.
యుద్ధం పూర్తయిన తరువాత .. విజయానికి కారకుడైన ముచుకుందుడిని దేవతలు అభినందిస్తారు. తమకి చేసిన సాయానికిగాను ఏదైనా వరం కోరుకోమని అడుగుతారు. ఎడతెరపి లేని యుద్ధంలో పోరాడి అలసిన తనకి, కొన్నేళ్లపాటు హాయిగా నిద్రించే వరం ప్రసాదించమని ముచుకుందుడు కోరతాడు. ఆ సమయంలో ఎవరైతే తనకి నిద్రా భంగం కలిగిస్తారో వాళ్లు తన కంటిచూపు సోకగానే భస్మం అయ్యేలా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అందుకు దేవతలు తథాస్తు అంటూ ఆయన కోరికను మన్నిస్తారు.
అప్పటి నుంచి ముచుకుందుడు సామాన్యుల కంటబడని ఒక గుహను ఎంపిక చేసుకుని అందులో నిద్రిస్తూ ఉంటాడు. ఆయనకి గల వరం గురించి తెలిసిన కృష్ణుడు, కాలయవనుడిని ఆ గుహకు తీసుకువెళతాడు. ముచుకుందుడి గురించి తెలియని కాలయవనుడు, ముసుగుపెట్టి పడుకున్నది కృష్ణుడని అనుకుంటాడు. అహంభావంతో కాలుతో తన్నుతాడు. అలా ముచుకుందుడిని నిద్రనుంచి లేపిన కాలయవనుడు, ఆయన కంటిచూపు సోకగానే భస్మమైపోతాడు. అప్పటివరకూ చాటుగా ఉంటూ ఇదంతా చూస్తున్న కృష్ణుడు బయటికి వచ్చి, జరిగిందంతా ముచుకుందుడికి వివరిస్తాడు. కృష్ణ దర్శనభాగ్యం లభించినందుకు ముచుకుందుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
