మహాదేవుడు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో పంచారామ క్షేత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పంచారామాలలోని శివలింగాలన్నీ కూడా ఒకే ముహూర్తంలో ప్రతిష్ఠించబడినవిగా స్థలపురాణం చెబుతోంది. పంచారామాలుగా పిలవబడే క్షేత్రాల జాబితాలో అమారారామం .. కుమారారామం .. క్షీరారామం .. ద్రాక్షారామం .. సోమారామం కనిపిస్తాయి. సోమారామం విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలోని “గునుపూడి”లో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. “భీమవరం” నుంచి ఆటోల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

సువిశాలమైన ప్రదేశంలో .. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. పొడవైన ప్రాకారాలు … ప్రాకార మంటపాలు .. ఎత్తైన గోపురాలు ఈ క్షేత్ర వైభవానికి అద్దం పడుతుంటాయి. మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. గర్భాలయంలో కొలువైన స్వామివారు సోమేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. పరమేశ్వరుడు .. సోమేశ్వరుడు అనే పేరుతో పూజలు అందుకోవడానికి వెనుక లోక కల్యాణ కారకమైన ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు తన మెడలో అమృతలింగాన్ని ధరిస్తాడు. సతీదేవి యోగాగ్నిలో దహించబడటం .. శివుడు నిరంతర ధ్యానంలోనే ఉండటం వలన, శివ దంపతులకు జన్మించినవారితో తప్ప, మరొకరితో తనకి మృత్యువనేది లేకుండా బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని కోరతాడు. శివుడు మళ్లీ వివాహం చేసుకోడు గనుక, అలా తనకి మరణమనేది లేనట్టేననే అహంభావంతో లోకాలను అల్లకల్లోలం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే అమ్మవారు పార్వతీదేవిగా జన్మించడం .. దేవతల ప్రమేయంతో వారి వివాహం జరగడం .. ఆ దంపతుల తేజో రూపంగా కుమారస్వామి జన్మించడం జరిగిపోతుంది.

దేవతలకి సేనాధి పతిగా ఉన్న కుమారస్వామి .. తారకాసురుడి మెడలోని అమృతలింగాన్ని ఛేదించి ఆయనను సంహరిస్తాడు. ఆ అమృత లింగం ఐదు ముక్కలైపోయి ఐదు ప్రదేశాల్లో పడతాయి. ఆ ప్రదేశాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. “గునుపూడి” ప్రదేశంలో పడిన అమృత లింగం యొక్క భాగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. చంద్రుడికి సోముడు అనే పేరు ఉంది. సోముడు ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడి శివుడిని సోమేశ్వరుడి గా పూజిస్తూ ఉంటారు. అందువల్లనే పౌర్ణమి – అమావాస్యలలో ఇక్కడి శివలింగం రంగు మారుతూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారు పార్వతీదేవి పేరుతోనే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది.

శివపార్వతులు కొలువైన కారణంగా కొత్తగా వివాహమైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి జనార్ధన స్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. మహా శివరాత్రి రోజున ఈ క్షేత్రం భక్త జనసందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలోను .. అలాగే ఇతర పర్వదినాలలోను స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పంచారామాలను వరుసగా దర్శించుకుని రావాలనే ఉద్దేశంతో బృందాలుగా వెళ్లే భక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయనేది భక్తుల విశ్వాసం.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.