ధర్మరాజు “ఇంద్రప్రస్థపురము”ను పరిపాలిస్తూ ఉంటాడు. అక్కడ ఆయన రాజసూయయాగం తలపెడతాడు. రాజసూయయాగానికి సంబంధించిన ఆహ్వానం అందగానే కృష్ణుడు అక్కడికి బయల్దేరతాడు. ఇంద్రప్రస్థంలో అడుగుపెట్టిన కృష్ణుడికి పాండవులు ఎంతో ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతారు. వాళ్లందరినీ కృష్ణుడు ఎంతో ప్రేమ పూర్వకంగా పలకరిస్తాడు. రాజసూయయాగానికి సంబంధించిన విషయాలను కృష్ణుడితో ధర్మరాజు చెబుతాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను గురించి వివరిస్తాడు.

అప్పుడు కృష్ణుడు .. జరాసంధుడి గురించి ప్రస్తావిస్తాడు. రాజసూయయాగం తలపెట్టడానికి ముందుగా జరాసంధుడిని అంతం చేయాలని చెబుతాడు. అందుకు తనకి భీముడి సాయం అవసరమవుతుందని అంటాడు. జరాసంధుడికి ఎలాంటి అస్త్రశస్త్రాల వలన మరణం సంభవించదనీ, అలా ఆయున వరాన్ని పొందాడని చెబుతాడు. అందువలన జరాసంధుడిని భీముడు మల్లయుద్ధంలోనే జయించవలసి ఉంటుందని అంటాడు. తన నక్షత్రంలో జన్మించినవాడి చేతిలోనే జరాసంధుడు మరణిస్తాడనీ, భీముడు అదే నక్షత్రంలో జన్మించాడనే విషయాన్ని వివరిస్తాడు.

మల్లయుద్ధం అనగానే భీముడు ఉత్సాహాన్ని చూపుతాడు. జరాసంధుడిని అంతం చేసి తీరతాననీ, లోక కల్యాణానికి కారకుడిని కావడం కన్నా గర్వించదగిన విషయం ఏముంటుందని అంటాడు. వెంటనే బయల్దేరడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ గద అందుకుంటాడు. జరాసంధుడు బ్రాహ్మణుల పట్ల విపరీతమైన అభిమానం కలిగి ఉంటాడు. బ్రాహ్మణులు ఏది అడిగినా ఆయన కాదనడు. అందువలన తాము బ్రాహ్మణుల రూపంలో వెళ్లి, ఆయనతో మల్లయుద్ధం చేయాలని ఉందని కోరడమే సరైన మార్గం అని కృష్ణుడు చెబుతాడు.

ఆ విధంగా చేయడమే సరైన పని అని ధర్మరాజుతో సహా అంతా అంగీకరిస్తారు. జరాసంధుడితో భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు తాను అక్కడే ఉంటాననీ, తనని గమనిస్తూ అతనితో యుద్ధం చేయమని భీముడితో కృష్ణుడు చెబుతాడు. జరాసంధుడు మహా బలవంతుడు .. అంతకు మించిన మేధావి. అందువలన అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండాలని అంటాడు. ఆయన ఎంతటి ఘనుడైనా తన చేతిలో చావకతప్పదని భీముడు అంటాడు. ఆ తరువాత కృష్ణుడు .. భీముడు ఇద్దరూ కూడా బ్రాహ్మణుల వేషంలో జరాసంధుడి రాజ్యానికి బయల్దేరతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.