Sri Bhagavatam – Parasurama kills sons of Kartaviryarjuna

కార్తవీర్యార్జునుడు మరణించడంతో ఆయన కుమారులు ఆవేదన చెందుతారు. తమ తండ్రి మరణానికి కారకుడైన జమదగ్ని మహర్షిని అంతం చేయాలని నిర్ణయించుకుంటారు. పరశురాముడి పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసినవారు కావడం వలన, ఆయన లేని సమయం చూసి ఆశ్రమానికి వెళతారు. అందరూ కలిసి జమదగ్నిని చుట్టుముట్టి ఆయనని హతమారుస్తారు. అదే సమయంలో అక్కడికి రేణుకాదేవి రావడంతో వాళ్లంతా పరుగు అందుకుంటారు. జమదగ్ని మహర్షి ప్రాణాపాయ స్థితిలో ఉండటం చూసి ఆమె “పరశురామా!” అంటూ పెద్దగా అరుస్తుంది.

తల్లి కేక విన్న వెంటనే పరశురాముడు పరిగెత్తుకుని వస్తూనే ఉంటాడు. రాళ్లను .. ముళ్ల పొదలను కూడా లెక్క చేయకుండా ఆయన వేగంగా వస్తూనే ఉంటాడు. ఆయన వస్తూ ఉండగానే ఆమె అలా అరుస్తూనే ఉంటుంది. 21వ పిలుపుకి పరశురాముడు ఆశ్రమానికి చేరుకుంటాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తండ్రిని చూస్తాడు. జరిగిన దానికి కారకులు ఎవరని అడుగుతాడు. అతని చేతిలో మరణించిన కార్తవీర్యార్జునుడి కొడుకులే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారని రేణుక చెబుతుంది. పగతోనే వాళ్లు ఇలా చేశారని అంటుంది.

తండ్రి ప్రాణాలను కాపాడమని తన సోదరులతో చెప్పి, గొడ్డలి అందుకుని పరశురాముడు బయల్దేరతాడు. కార్తవీర్యార్జునుడి నగరానికి చేరుకుంటాడు. తమని వెతుకుతూ పరశురాముడు వచ్చాడని తెలిసి కార్తవీర్యార్జునుడి కుమారులు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పరశురాముడు వాళ్లని వెతికి పట్టుకుని మరీ వాళ్ల శిరస్సులను ఖండిస్తాడు. తన తల్లి ఆర్తితో తనని 21 మార్లు పిలిచింది గనుక, 21 మార్లు దండెత్తి అధర్మ మార్గంలో నడిచే అహంభావ వంతులైన రాజులందరినీ సంహరిస్తూ వెళాతాడు.

ఆ తరువాత పరశురాముడు తన ఆశ్రమానికి వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరిస్తాడు. తండ్రిని బ్రతికించుకోవడం కోసమే అయినా, కామధేనువును కాపాడటం కోసమే అయినా అతను సంహరించడం వలన పాపం వెంటాడుతూనే ఉంటుందని జమదగ్ని మహర్షి చెబుతాడు. చేసిన పాపం పోవడానికిగాను, తపస్సు చేయడం మంచిదని వాళ్లు చెబుతారు. తన తల్లిదండ్రుల మాట ప్రకారం పరశురాముడు తపస్సు చేసుకోవడానికి గాను, మహేంద్రగిరి వైపు సాగుతాడు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Parasurama kills sons of Kartaviryarjuna