రాజుగా తన ప్రజల ఆలనా పాలన చూసుకోవలసిన పౌండ్రక వాసుదేవుడు, నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచన చేస్తుంటాడు. అతను కూడా అచ్చు కృష్ణుడి మాదిరిగానే నుదుటిపై కస్తూరి తిలకము .. కిరీటము .. నెమలి పింఛము .. మకరకుండలాలు .. కృత్రిమ కౌస్తుభము ధరిస్తూ ఉంటాడు. చేతిలో వేణువు పట్టుకుని .. శంఖు చక్రములను ధరించి తిరుగుతూ ఉంటాడు. మెడలో పొడవైన పూలమాల వ్రేలాడుతూ ఉంటుంది .. పట్టు పీతాంబరాలు ధరిస్తూ ఉంటాడు. అయినా తనని కాకుండా అందరూ ఆ కృష్ణుడిని వాసుదేవుడు అంటూ ఉండటం పౌండ్రకవాసుదేవుడికి తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తుంది.

దాంతో నిజమైన వాసుదేవుడిని తానేననీ, తనని చూసే కృష్ణుడు నెమలి పింఛము .. వేణువు ధరించి తిరుగుతున్నాడని ప్రచారం చేయడం మొదలు పెడతాడు. శంఖచక్రాలు తనకి వరప్రసాదముగా లభించాయనీ, కానీ ఆ వాసుదేవుడు వాటిని అలంకారంగా ధరించి తానే వాసుదేవుడినని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని చెప్పుకుంటూ ఉంటాడు. శౌర్య పరాక్రమాలలో కూడా తానే ముందుంటాననీ, అందువల్లనే ఆ వాసుదేవుడు తనకంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని అంటూ ఉంటాడు. సరైన సమయంలో వాసుదేవుడికి తగిన విధంగా బుద్ధి చెబుతానని చెప్పుకుంటూ ఉంటాడు.

అయితే ఎవరూ కూడా ఆయన మాటలను వినిపించుకోరు .. పట్టించుకోరు. రాజుగనుక చాలామంది అది నిజమే అన్నట్టుగా ఒక నవ్వు నవ్వేసి వెళ్లిపోతుంటారు. మిగతావాళ్లు కృష్ణుడితో ఇతనికి ఎందుకొచ్చిన పోలిక అనుకుంటారు. జనం తనని పట్టించుకోవడం లేదు .. వాసుదేవుడిగా అంగీకరించడం లేదు అనే విషయం పౌండ్రక వాసుదేవుడికి అర్థమైపోతుంది. ఇక లాభం లేదు .. వాసుదేవుడి పేరుతో ఎవరో ఒకరు మాత్రమే ఈ భూమిపై ఉండాలి .. అది తానే కావాలి అని భావిస్తాడు. తన ఆధిపత్యాన్ని కృష్ణుడు అంగీకరించేలా చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఇలా తాను ఒక చోట వాసుదేవుడినని చెప్పుకోవడం .. కృష్ణుడు తాను వాసుదేవుడినని చెప్పుకోవడం సరికాదు. అందువలన తానే వాసుదేవుడినని అంగీకరించవలసిందిగా కృష్ణుడికి శ్రీముఖం పంపించాలని నిర్ణయించుకుంటాడు. తనని వాసుదేవుడిగా ఒప్పుకోవడమే కాకుండా వెంటనే వేషధారణ మార్చుకోవాలనీ, శంఖ చక్ర గదా వేణువులను త్యజించాలని శ్రీముఖం పంపిస్తాడు. ఒకవేళ అందుకు ఒప్పుకోని పక్షంలో తనతో యుద్ధానికి సిద్ధంకమ్మని చెబుతాడు. ఇదొక చిత్రమైన పరిస్థితి అని కృష్ణుడు నవ్వుకుంటాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.