పౌండ్రకవాసుదేవుడు తాను వాసుదేవుడినని చెప్పుకుంటున్నందుకు కృష్ణుడు ఏమీ పట్టించుకోడు. శంఖచక్రాలను త్యజించమని తనకి శ్రీముఖం పంపినందుకు కూడా ఆయన బాధపడదు. కానీ తానే వాసుదేవుడినని అంగీకరించమంటూ సామాన్య ప్రజలను ఆయన ఇబ్బందులకు గురించేస్తుండటం కృష్ణుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా పౌండ్రకుడికి తగిన విదంగా బుద్ధిచెప్పాలని కృష్ణుడు నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా తన రథంపై బయల్దేరతాడు. పౌండ్రకవాసుదేవుడి రాజ్యానికి చేరుకుంటాడు.
తన ఎదురుగా నిలిచిన కృష్ణుడిని చూసి పౌండ్రక వాసుదేవుడు నవ్వుకుంటాడు. తాను కబురుచేయగానే కృష్ణుడు కంగారుపడిపోయి పరిగెత్తుకుని వచ్చాడని అనుకుంటాడు. ఇక ఆలస్యం చేయక ఆయుధాలను త్యజించేసి .. ఇకపై వాసుదేవుడు పేరుతో పిలిపించుకోనని చెప్పేసి వెళ్లిపొమ్మని అంటాడు. ఇప్పటివరకూ తన పేరుతో గౌరవ మర్యాదలు అందుకున్నందుకు తాను ఏమీ అనననీ, క్షమించి వదిలేస్తానని చెబుతాడు. కాదని అంటే కదన రంగంలోనే బుద్ధి చెబుతానని అంటాడు. తక్షణమే ఆయుధాలు వదిలివెళ్లమని చెబుతాడు.
తన పేరు పెట్టుకుని .. అచ్చు తనని అనుసరిస్తూ .. ఏవేవో మాయలు చేసి అతను అందరినీ భయకంపితులను చేసిన విషయాలను తాను విని ఉన్నానని పౌండ్రకవాసుదేవుడు అంటాడు. తన దగ్గర అలాంటి గారడీలు చేయవద్దని చెబుతాడు. ఆయా మాయలు ద్వారకలోనే తప్ప, తన రాజ్యంలో పనిచేయవని ఎద్దేవా చేస్తాడు. ఊళ్లో వాళ్లు ఊసుపోక పొగిడితే పొంగిపోతే ఇలాగే ఉంటుందని అంటాడు. ఇక తాను చెప్పినట్టుగా చేసి, ద్వారక వరకు వెనుదిరిగి చూడకుండా వెళ్లమని చెబుతాడు. తనవాళ్లు ఎవరూ ఏమీ అనకుండా తాను చూసుకుంటానని అంటాడు.
పౌండ్రకవాసుదేవుడి మాటలకు కృష్ణుడు నవ్వుకుంటాడు. ఎవరు ఎవరి వేషధారణను అనుసరించింది అతనికి తెలుసునని అంటాడు. ఎవరు శంఖచక్రాలను అలంకారంగా తెచ్చుకున్నది కూడా అతనికి తెలుసునని చెబుతాడు. అతను కోరుకున్న విధంగా చివరికి అసలైన వాసుదేవుడే భూమిపై ఉంటాడని చెప్పి, తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు. అంతే సుదర్శన చక్రం నేరుగా వెళ్లి ఆయన శిరస్సును ఖండిస్తుంది. తనని శత్రువుగా భావించనప్పటికీ నిరంతరం తన నామాన్నే ఉచ్చరిస్తూ వచ్చిన కారణంగా కృష్ణుడు ఆయనకి ముక్తిని ప్రసాదిస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.