ఒక వైపున కృష్ణుడు .. సత్యభామను పెళ్లాడాలని భావించడం, మరో వైపున “శ్యమంతకమణి”ని గురించి అడగడం సత్రాజిత్తుకు ఆందోళన కలిగిస్తుంది. కృష్ణుడు మహా మాయావి కనుక, ఏ క్షణంలోనైనా ఆయన సత్యభామను సొంతం చేసుకోవచ్చును. అలాగే తన నుంచి “శ్యమంతకమణి”ని కూడా చేజిక్కుంచుకోవచ్చును. అందువలన ఈ రెండిటినీ కాపాడుకోవడం తన ముందున్న కర్తవ్యమని భావిస్తాడు. సత్యభామను శతధన్వుడికి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తాడు. అలాగే మణిని కాపాడవలసిన బాధ్యతను తన తమ్ముడైన ప్రసేనుడికి అప్పగిస్తాడు.

శ్యమంతకమణిని ఎక్కడ పెట్టినా కృష్ణుడు కాజేస్తాడనే ఉద్దేశంతో ప్రసేనుడు ఆ మణిని తన మెడలో ధరిస్తాడు. అలా శ్యమంతకమణిని ధరించిన ప్రసేనుడు, ఒక రోజున అడవికి వెళతాడు. క్రూరమృగాలను వేటాడుతూ దట్టమైన అడవిలోకి వెళతాడు. అలా ఆయన వేటాడుతూ ఉండగా, ఆయన మెడలో ఎర్రగా వ్రేలాడుతున్న మణిని చూసిన సింహం .. అది మాంసపు ముద్దగా భావించి ప్రసేనుడిపై దాడి చేస్తుంది. సింహం బారి నుంచి కాపాడుకోవడానికి ప్రసేనుడు తనవంతు ప్రయత్నం చేస్తాడు. కానీ చివరికి ఆ సింహం వలన ప్రాణాలు కోల్పోతాడు.

అదే సమయంలో జాంబవంతుడు అటుగా వస్తాడు .. ప్రసేనుడు సింహం కారణంగా మరణించడం చూస్తాడు. ఆ సింహంపై పోరాడి దానిని అంతం చేసిన జాంబవంతుడు, అక్కడే పడి ఉన్న మణిని తీసుకుని తన గుహకి వస్తాడు. ఆ మణితో గుహలోకి అడుగుపెట్టగానే గుహ అంతా కూడా కాంతివంతమవుతుంది. ఆ వెలుగును చూసి అంతా ఆశ్చర్యపోతారు. తండ్రి తెచ్చిన హారాన్ని చూసిన “జాంబవతి” ఎంతో మురిసిపోతుంది. ఆ హారం తనకి ఎంతగానో నచ్చిందని చెప్పేసి తన మెడలో ధరిస్తుంది. ఆ హారాన్ని ధరించి ఆటపాటలతో మునిగిపోతుంది.

వేటకి వెళ్లిన ప్రసేనుడు ఎంతకీ రాకపోవడంతో, సత్రాజిత్తు ఆందోళన చెందుతూ ఉంటాడు. తన మనసు ఏదో కీడు శంకిస్తోందని అంటాడు. ప్రసేనుడికి ఏమైనా జరిగి ఉంటుందా? ఏమీ కాకపోతే ఎందుకు రాలేదు? శ్యమంతకమణి కోసం కృష్ణుడు అతనిని ఏమైనా చేసి ఉంటాడా? అందువల్లనే ప్రసేనుడు తిరిగి రాలేదా? అనుకుంటూ పరిపరివిధాలుగా ఆలోచన చేస్తూ పచార్లు చేస్తూ ఉంటాడు. ఇంతటి పాపానికి పాల్పడిన ఆ కృష్ణుడి సంగతి తేలుస్తానంటూ ఆగ్రహావేశాలకు లోనవుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.