హనుమంతుడి జీవితాన్ని పరిశీలిస్తే ఒక వైపున భక్తుడిగా .. మరో వైపున భగవంతుడిగా ఆయన ప్రదర్శించిన మహిమలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. భారతదేశంలో రామాలయం లేని గ్రామం ఉండదు .. హనుమంతుడు లేని రామాలయం ఉండదు. శ్రీరాముడి భక్తుడిగా ఆయనతో పాటు గర్భాలయంలో పూజాభిషేకాలు అందుకోవడం .. క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకోవడం .. ఉపాలయంలో కొలువై దర్శనం ఇవ్వడం .. ప్రధాన దైవంగా భక్తులను అనుగ్రహించడం ఒక్క హనుమంతుడికే చెల్లిందని చెప్పుకోవాలి.
భక్త ఆంజనేయుడు .. దాసాంజనేయుడు .. యోగాంజనేయుడు .. ధ్యానాంజనేయుడు .. వీరాంజనేయుడు .. ఇలా అనేక నామాలతో .. ముద్రలతో హనుమంతుడు ఆయా క్షేత్రాలలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి హనుమంతుడు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో కడప జిల్లాలోని ‘ప్రొద్దుటూరు’ ఒకటిగా కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. రావణ సంహారం అనంతరం ఆ పాపం నుంచి ముక్తిని పొందడం కోసం శ్రీరాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లాడు.
సీత .. లక్ష్మణ .. హనుమలు ఆయనను అనుసరిస్తూ వెళ్లసాగారు. రాముడు నిర్ణయించిన ముహూర్తానికి ఆయనకి శివలింగాలను అందజేస్తూ వెళుతుంటాడు హనుమంతుడు. ఇక్కడి “పెన్నా” నదీతీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరాముడు చెప్పడంతో “కాశీ” నుంచి శివలింగాన్ని తీసుకుని రావడానికి హనుమంతుడు వెళతాడు. ముహూర్త సమయం మించి పోతుంటుంది. పొద్దు పొడవకముందే ప్రతిష్ఠ జరిగిపోవాలనే ఉద్దేశంతో, రాముడు ఇసుకతోనే శివలింగాన్ని చేసి ప్రతిష్ఠిస్తాడు. పొద్దు పొడవక ముందే రాముడు శివలింగ ప్రతిష్ఠ చేసిన కారణంగా ఈ క్షేత్రానికి “ప్రొద్దుటూరు” అనే పేరు వచ్చిందని అంటారు.
ఆ తరువాత హనుమ తెచ్చిన శివలింగాన్ని కూడా రాముడు ఆ పక్కనే ప్రతిష్ఠ చేస్తాడు. ఇప్పటికీ ఈ రెండు శివలింగాలు పక్కపక్కనే కనిపిస్తాయి. ఇక ఇక్కడే సీతారాములను మహర్షులు దర్శించుకున్నారట. ఆ సమయంలో హనుమను అక్కడ ఉండిపోవలసిందిగా వాళ్లంతా అభ్యర్థించారు. సీతారాములను విడిచి తాను ఉండలేనని చెప్పిన హనుమ, తన మూర్తిని వారికి అందజేశాడట. ఆ మూర్తిని పూజించడం వలన .. తనని ప్రత్యక్షంగా పూజించిన ఫలితం లభిస్తుందని సెలవిచ్చాడని స్థలపురాణం చెబుతోంది. ఆ తరువాత కాలంలో మరుగున పడిపోయిన ఈ మూర్తి, ఒక భక్తుడికి తన జాడను తెలియజేసి 600 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చినట్టుగా చెబుతున్నారు.
స్వప్నంలో స్వామి వారు చెప్పిన జాడలను బట్టి ఆ మూర్తిని కనుగొని ఆ భక్తుడు బండిపై తన ఊరుకు తీసుకుని వస్తుండగా, ఒక ప్రదేశం దగ్గరికి రాగానే ఎద్దులు ముందుకు కదలలేదట. అది స్వామివారి ఆదేశంగా భావించి అక్కడే ఆ మూర్తిని ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి స్వామివారి మూర్తి చాలా భారీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. విగ్రహం పెరుగుతూ ఇంతటి ఆకారాన్ని సంతరించుకుందని అంటున్నారు. వైశాఖ మాసంలోని “హనుమజ్జయంతి” రోజున ప్రత్యేక పూజలు .. సేవలు జరుగుతాయి. ఇక్కడి స్వామివారి దర్శనం వలన సమస్త గ్రహ బాధలు .. దుష్ట శక్తుల పీడలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.
గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.