Sri Bhagavatam – Rama Lakshman protecting Vishwamitra maharshi yaga .. Sita swayamvaram

రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట ఆయన ఆశ్రమం సమీపానికి చేరుకుంటారు. అదే సమయంలో ఒక్కసారిగా వాళ్లపై “తాటకి” విరుచుకుపడుతుంది. పెద్ద పెద్ద కొండరాళ్లను రామలక్ష్మణుల పైకి విసురుతూ ఉంటుంది. తాటకి స్త్రీ కావడంతో ఆమెను వధించడం ధర్మం కాదని రాముడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అనునిత్యం ఆమె కారణంగా యాగనికి అంతరాయం కలుగుతోందనీ, మరో ఆలోచన చేయకుండా తాటాకిని వధించమని విశ్వామిత్రుడు చెబుతాడు. దాంతో రాముడు ఆమె పైకి బాణాలను సంధిస్తాడు.

తాటకి పెద్దగా హాహాకారాలు చేస్తూ నేల కూలుతుంది. అక్కడి నుంచి ఆశ్రమానికి చేరుకున్న రామలక్ష్మణులు, ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు యాగం మొదలుపెడతాడు. రామలక్ష్మణులు యాగ రక్షణ చేస్తూ ఉంటారు. అదే సమయంలో మారీచుడు – సుబాహుడు అనే రాక్షసులు వస్తారు. వాళ్లు హోమగుండంలో రక్తధారలతో యాగానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆశ్రమవాసులందరినీ భయకంపితులను చేస్తుంటారు.

రామలక్ష్మణులు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా, ఆ అసురులపైకి వరుసగా బాణాలను సంధిస్తారు. ఆ బాణాల ధాటికి సుబాహుడు ప్రాణాలను వదలగా, గాయాలపాలైన మారీచుడు తప్పించుకుని పారిపోతాడు. యాగం పూర్తయిన తరువాత రామలక్ష్మణులను విశ్వామిత్రుడు అభినందిస్తాడు. ఆ తరువాత వాళ్లను వెంటబెట్టుకుని ఆయన “మిథిలా నగరం” వెళతాడు. అక్కడ సీత స్వయంవరానికి జనకుడు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. శివధనుస్సును ఎక్కుపెట్టినవారికే తన కూతురును ఇచ్చి వివాహం జరిపిస్తానని ఆయన ప్రకటిస్తాడు.

సీత స్వయంవరంలో రాముడు కూడా పాల్గొంటాడు. ఎంతోమంది రాజులు శివధనుస్సును ఎక్కుపెట్టలేక వెనుదిరుగుతారు. విశ్వామిత్రుడి ఆదేశంతో రాముడు శివధనుస్సును ఎక్కుపెట్టి వింటికి నారి బిగించబోతుండగా అది ఫెళ ఫెళ మంటూ విరిగిపోతుంది. దాంతో సీతాదేవి తన చేతిలోని పూలమాలను శ్రీరాముడి మెడలో వేస్తుంది. జనకుడి వర్తమానం అందుకున్న దశరథుడు తన పరివారంతో వస్తాడు. మాటలు పూర్తయిన తరువాత సీతారాములకు .. లక్ష్మణుడు – ఊర్మిళకు .., జనకుడి సోదరుడి కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తిలతో భరత శత్రఘ్నులకు వివాహం జరుపుతారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Rama Lakshman protecting Vishwamitra maharshi yaga .. Sita swayamvaram