Ramayanam – 63 : Rama Sita goes to Ayodhya
లంకానగరం నుంచి పుష్పక విమానం బయల్దేరుతుంది. ఆకాశ మార్గాన వెళుతున్న పుష్పక విమానం నుంచి కిందనున్న ప్రదేశాలను చూస్తూ, సీతాదేవి ఊరట చెందుతూ ఉంటుంది. తాము ఏ ప్రదేశాల మీదుగా నడచుకుంటూ వచ్చింది .. ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకున్నది .. శబరి ఆశ్రమం .. ఋష్యమూక పర్వతం .. ఇవన్నీ కూడా సీతాదేవికి చూపిస్తూ ఉంటాడు రాముడు. తన ఆచూకీ తెలుసుకోవడం కోసం రామలక్ష్మణులు ఎన్ని కష్టాలు పడ్డారనేది ఆమెకి అర్థమై మనసు భారమవుతుంది. అలా పుష్పక విమానంలో వాళ్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది.
పుష్పక విమానం భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది. విమానం దిగగానే భరద్వాజుడికి రామలక్ష్మణులు, సుగ్రీవుడు, విభీషణుడు అంతా భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తారు. సీతారామ లక్ష్మణులు క్షేమంగా తిరిగిరావడం పట్ల భరద్వాజుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. వచ్చిన వాళ్లందరికీ ఆయన అతిథి మర్యాదలు చేస్తాడు. అందరికీ అవసరమైన భోజన పదార్థాలను ఏర్పాటు చేస్తాడు. అయోధ్య నగర క్షేమ సమాచారం గురించి భరద్వాజుడిని అడుగుతాడు రాముడు. తన తల్లులు, సోదరులను గురించి ప్రశ్నిస్తాడు.
అయోధ్యలో ప్రజలంతా కూడా సీతారామలక్ష్మణులు లేని లోటును గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారని భరద్వాజుడు అంటాడు. ఇతర విషయాల్లో వాళ్లకి ఎలాంటి లోటు లేకుండా భరతుడు పాలిస్తున్నాడని చెబుతాడు. ఇక కౌసల్య, కైకేయి, సుమిత్ర అంతా కూడా సీతారామలక్ష్మణులు అరణ్యవాసం ఎప్పుడు పూర్తవుతుందా అనే ఎదురుచూస్తున్నారని చెబుతాడు. రాముడి పాదుకలను పెట్టుకునే భరతుడు రాజ్యపాలనను కొనసాగిస్తున్నాడనీ, రాముడి రాకకోసమే ఎదురుచూస్తున్నాడని అంటాడు. ఆ మాట వినగానే రాముడికి మనసు భారమవుతుంది.
అయోధ్య వెళ్లి తన రాకను గురించి తన సోదరుడైన భరతుడికి, తన తల్లులకు తెలియజేయమని హనుమంతుడిని పంపిస్తాడు. మార్గమధ్యంలో గుహుడుకి తమ క్షేమ సమాచారాన్ని తెలియజేయమని చెబుతాడు. తాను అయోధ్యకి తిరిగి రావడం భరతుడికి ఇష్టమో లేదో అనే విషయాన్ని తనకి చెప్పమని పంపిస్తాడు. హనుమంతుడు మారు వేషంలో అయోధ్యకి చేరుకుంటాడు. రాముడి కోసం భరతుడు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడనే విషయాన్ని గ్రహించి, ఆయనకి విషయం చెబుతాడు. ఆ మాట వినగానే భరతుడు ఆనందంతో పొంగిపోతాడు. రాజలాంఛనాలతో సీతారామలక్ష్మణులను అయోధ్యకు తీసుకురావడానికి సిద్ధమవుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 63 : Rama Sita goes to Ayodhya
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.