ప్రాచీనకాలం నాటి శైవ క్షేత్రాలను దర్శనం చేసుకున్నప్పుడు అక్కడి శివలింగం రాముడు ప్రతిష్ఠించిందనో .. పరశురాముడు ప్రతిష్ఠించిందనో అక్కడి స్థలపురాణం చెబుతూ ఉంటుంది. ఇక మహర్షులలో కొందరు ప్రతిష్ఠించిన శివలింగాలు నేటికీ పూజాభిషేకాలు జరుపుకుంటూ మహిమాన్వితమైన క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా “సత్రశాల” కనిపిస్తుంది. ఇక్కడి మల్లికార్జునస్వామిని సాక్షాత్తు విశ్వమిత్ర మహర్షి ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. గుంటూరు జిల్లా “జెట్టిపాలెం” సమీపంలో కృష్ణానది ఒడ్డన ఈ క్షేత్రం వెలుగొందుతోంది.

విశ్వామిత్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికీ .. ఈ క్షేత్రానికి ఈ పేరుకి రావడానికి గల కారణం .. రామాయణంలో జరిగిన ఒక సంఘటనతో ముడిపడుతూ కనిపిస్తుంది. అయోధ్యను పరిపాలిస్తున్న దశరథమహారాజు దగ్గరికి విశ్వామిత్ర మహర్షి వస్తాడు. తాను ఒక యాగాన్ని తలపెట్టాననీ .. ఆ యాగానికి మారీచ సుబాహులు అనే అసురులు అంతరాయం కలిగిస్తున్నారని చెబుతాడు. యాగ సంరక్షణ కోసం రాముడిని పంపించమని దశరథుడిని కోరతాడు. ఆ మాట వినగానే దశరథుడు ఉలిక్కిపడతాడు.

రాముడు పసివాడనీ .. రాక్షస మాయలు ఎంతమాత్రం తెలియనివాడని దశరథుడు అంటాడు. అవసరమైతే తాను తన సేనలను తీసుకుని వస్తానని చెబుతాడు. అందుకు విశ్వామిత్రుడు ఒప్పుకోకపోవడంతో, దశరథుడికి వశిష్ఠ మహర్షి నచ్చ జెబుతాడు. అలా విశ్వామిత్రుడు వెంట నడచిన రామలక్ష్మణులు ఇప్పుడు ఈ క్షేత్రం ఉన్న ప్రదేశానికి చేరుకున్నారట. రామలక్ష్మణులు యాగ రక్షణ చేస్తుండగా, ఇక్కడే విశ్వామిత్రుడు “సత్రయాగం” చేశాడట. అందువల్లనే ఈ క్షేత్రానికి “సత్రశాల” అనే పేరు వచ్చిందని అంటారు.

ఇది రామలక్ష్మణులతో పాటు విశ్వామిత్రుడు తిరుగాడిన ప్రదేశమనడానికి గుర్తుగా ఇక్కడి రామాలయంలో విశ్వామిత్రుడి మూర్తి ఉంటుంది. రామలక్ష్మణులతో కలిసి ఆయన కూడా పూజలు అందుకుంటూ ఉంటాడు. అప్పటికి రాముడికి ఇంకా సీతతో వివాహం కాలేదు .. హనుమంతుడితో పరిచయం కూడా కాలేదు. అందువలన ఈ క్షేత్రంలోని గర్భాలయంలో సీతమ్మవారి మూర్తిగాని .. హనుమ మూర్తి గాని ఉండవు. ఇక ఇక్కడే విశ్వామిత్రుడు ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడే శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది.

ఇక్కడి శివయ్య మల్లికార్జున స్వామిగా .. అమ్మవారు భ్రమరాంబిక దేవిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. ఈ శివలింగం శ్వేతవర్ణంలో పాలరాతిని గుర్తుచేస్తున్నట్టుగా ఉంటుంది. ఎంతోమంది రాజులు స్వామివారిని .. అమ్మవారిని సేవించి తరించారు. ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. అలా ఉపాలయంలో సంతాన మల్లయ్యస్వామి పేరుతో మరో శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ స్వామి దర్శనం వలన, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. విష్ణు సంబంధమైన .. శివ పరమైన పర్వదినాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.