కృష్ణుడు తనని ఎదిరించడానికి సిద్ధమవుతున్నాడనే విషయం తెలియగానే నరకాసురుడు నవ్వుకుంటాడు. ఒక గోపాలకుడు తనని ఎదిరించడానికి పూనుకోవడమా? తాను ఇంద్రాది దేవతలను ఎదిరించిన విషయం తెలిసి కూడా ముందడుగు వేయడమా? నరకాసురిడితో యుద్ధం అంటే గోపికలతో కలిసి నాట్యం చేయడం కాదనే సంగతి అతను త్వరలోనే తెలుసుకుంటాడు. అసురులలో అల్పులైనవారిని అంతమొందించి తాను కూడా అలాంటివాడినేనని అనుకుని రంగంలోకి దిగుతున్నాడు. తనతో యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ గోపాలుడి ద్వారా అందరూ అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం మంచిదే అనుకుంటాడు.

దేవతలు .. దానవులు .. గంధర్వులు .. ఇలా ఎవరి కారణంగా తనకి చావులేదు. తనని ఎవరూ జయించలేరు .. అసలు ఆ ఆలోచన చేసే సాహసం కూడా చేయలేరు. తనకి తన తల్లి చేతిలో తప్ప మరణం లేదనే విషయం ఆ గోపాలుడికి తెలియదేమో! తెలిస్తే ఇంతటి సాహసం చేయకపోవచ్చును. యుద్ధరంగాన తెలుసుకుంటే మరోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాడు గదా? అయినా తన గురించి శత్రువుకి తెలియక నానామాటలు మాట్లాడుతున్నప్పుడు, తెలియజెప్పవలసిన అవసరం తనపై ఉందని భావిస్తాడు.

ఇదిలా ఉండగా .. నరకాసురిడితో యుద్ధం చేయడానికి కృష్ణుడు సిద్ధమవుతుంటాడు. అది చూసిన సత్యభామ తాను కూడా యుద్ధానికి వస్తానని అంటుంది. మనసులో ఆనందపడిన కృష్ణుడు .. పైకి మాత్రం ఆమె రావడం సరైనదికాదని వారిస్తాడు. నరకాసురుడు మహా మాయావి అనీ .. వరబల సంపన్నుడని చెబుతాడు. అతని చేతిలో ఇంద్రాది దేవతలే ఓడిపోయారనీ, అలాంటి అసురుడికి సుకుమారమైన ఆమె ఎదురుగా నిలవడం కూడా మంచిది కాదని చెబుతాడు. తనలో ఎంతటి ధైర్యసాహసాలు ఉన్నాయనేది చూడమనీ, తనని తీసుకెళ్లమని సత్యభామ పట్టుపడుతుంది.

దాంతో అందుకు కృష్ణుడు అంగీకరిస్తాడు. నరకాసురిడితో యుద్ధానికి కృష్ణుడితో కలిసి సత్యభామ బయల్దేరుతుంది. నరకాసురుడు తన సైనిక బలగాలతో బయల్దేరి వస్తాడు. యుద్ధానికి ముందు కృష్ణుడు మరోసారి నరకాసురిడిని హెచ్చరిస్తాడు. అతని చెరసాలలో ఉన్న సాధు సత్పురుషులను విడుదల చేయమనీ, అలాగే “అదితి” కుండలాలను ఆమెకి అర్పించమని కోరతాడు. దేవమాత క్షమిస్తే తాను కూడా క్షమిస్తానని అంటాడు. తనకి ఎవరి క్షమాభిక్ష అవసరం లేదనీ, తాడో పేడో తేల్చుకోమని నరకుడు రెచ్చగొడతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.