కృష్ణుడికి .. నరకాసురిడికి మధ్య జరుగుతున్న సంభాషణను వింటున్న సత్యభామ సహనం కోల్పోతుంది. నరకాసురుడు అవమానకరంగా మాట్లాడుతుంటే, అంతగా బుజ్జగించవలసిన అవసరం ఏవుందని సత్యభామ అంటుంది. నరకాసురుడు యుద్ధమే కోరుకుంటున్నప్పుడు వారించవలసిన అగత్యం ఏవుందని అడుగుతుంది. ఇప్పటికే నరకాసురుడు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగిందనీ, ఇక ఆయుధాలతో సమాధానం చెప్పడమే సరైనదని అంటుంది. ఆలస్యం చేయక అస్త్రాలను సంధించడమే మేలని చెబుతుంది.

సత్యభామ నుంచి ఆ ఆవేశం కోసమే ఎదురుచూస్తున్న కృష్ణుడు, నరకాసురిడిపై బాణప్రయోగం చేస్తాడు. దాంతో ఇరు సైన్యాలు ముందుకు సాగుతాయి. పోరు భీకరంగా జరుగుతూ ఉంటుంది. అత్యంత శక్తిమంతమైన అస్త్రాలను నరకాసురుడు ప్రయోగిస్తుంటాడు. ఆ అస్త్రాలను కృష్ణుడు నిర్వీర్యం చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటాడు. కృష్ణుడిపై వరుస ఆయుధాలను ప్రయోగించడంలో నిమగ్నమైపోయిన నరకాసురుడు, తన సైన్యం పలచబడుతూ ఉండటాన్ని ఆలస్యంగా గమనిస్తాడు. అప్పటి నుంచి మరింత ఆగ్రహావేశాలతో విజృంభిస్తూ ఉంటాడు.

తన ఆయుధాలతో నరకాసురిడిని ఇబ్బందిపెడుతూ వస్తున్న కృష్ణుడు, ఇక అతనికి మరణం ఆసన్నమైందనే విషయాన్ని గ్రహించి, అతను ప్రయోగించిన అస్త్రం ధాటికి తట్టుకోలేకపోయినట్టుగా స్పృహ కోల్పోయినట్టుగా చేస్తాడు. దాంతో ఆగ్రహావేశాలకు లోనైన సత్యభామ విల్లును చేతబడుతుంది. స్త్రీతో యుద్ధం చేయడం తనకి అవమానకరమని చెప్పి, నరకాసురుడు ఆయుధాలను పక్కన పెట్టేస్తాడు. ఆమెను మరింతగా రెచ్చగొడుతూ మాట్లాడతాడు. సహనం కోల్పోయిన సత్యభామ బాణప్రయోగం చేస్తుంది. దాంతో ఒక్కసారిగా నరకాసురుడు కుప్పకూలిపోతాడు.

అప్పుడు అతనికి సత్యభామ రూపంలో తన తల్లి అయిన భూదేవి కనిపిస్తుంది. తనని మన్నించమని కోరుతూ అతను వచ్చి ఆమె పాదాలపై పడతాడు. తన ప్రాణాలు పోతున్నందుకు తనకి బాధగా లేదనీ, తల్లిని అవమానించిన బాధనే తట్టుకోలేకపోతున్నానని తల్లడిల్లిపోతాడు. భూదేవిగా ఆమె అతనికి జన్మనిచ్చిన విషయాన్నీ .. అతను పొందిన వరాన్ని గురించి కృష్ణుడు చెబుతాడు. నరకాసురుడు తమబిడ్డనే అనే విషయాన్ని తెలుసుకోగానే ఆమె తల్లి హృదయం కదిలిపోతుంది. శ్రీకృష్ణ సత్యభామలు తమ కుమారుడైన నరకాసురిడికి లక్ష్మీనారాయణులుగా దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదిస్తారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.