వృషపర్వుడి అభ్యర్థన మేరకు ఆయనతో కలిసి దేవయానిని తీసుకుని రాజ్యానికి చేరుకుంటాడు శుక్రాచార్యుడు. ఆయనకి తాను ఇచ్చిన మాటను గురించి శర్మిష్ఠతో చెబుతాడు వృషపర్వుడు. తమ రాజ్యానికీ .. పరిపాలనా సంబంధమైన విషయాల్లో తమకి శుక్రాచార్యుడి అవసరం ఎంతలా ఉందనేది కూతురికి వివరిస్తాడు. దేవయాని అహంభావంతో ప్రవర్తించిందా? శర్మిష్ఠ తప్పుగా వ్యవహరించిందా? అనే విషయాలను గురించి కాకుండా, తాను రాజ్య క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నానని అంటాడు. అందువల్లనే శుక్రాచార్యుడి షరతుకు తాను అంగీకరించానని చెబుతాడు.
తండ్రి తీసుకున్న నిర్ణయం శర్మిష్ఠకి చాలా కఠోరంగా వినిపిస్తుంది. దాసదాసీ జనాలతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన తాను, ఇకపై దేవయానికి దాసీగా ఉండటం ఆమెకి జీర్ణంకాని విషయంగా మారిపోతుంది. తన తండ్రినే గొప్పవాడని అంటూ అహంభావానికి పోయిన దేవయాని, తన పంతం నెగ్గించుకుంటోంది. ఇప్పుడు తాను వెళ్లి ఆమె ముందు ఓ దాసీగా నిలబడితే, ఆమె చూసే చూపును తట్టుకోవడం సాధ్యమేనా? అంతకంటే అదే బావిలో తాను దూకడం మేలుకదా? ఒకవేళ తాను పది మెట్లవరకూ దిగిపోయినా, తనతో ఆ దేవయాని చేయించే చాకిరి ఎలా ఉంటుందో!
దేవయాని స్వభావం తనకి బాగా తెలుసు .. తాను అనుకున్నది జరిగేవరకూ, దానిని సాధించే మార్గాలను గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. తాను కోరుకున్నది దక్కకపోతే అందు కోసం ఆమె ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది. ఒకరకంగా దేవయాని అలా మారడానికి కారకుడు ఆ శుక్రాచార్యుడే అనుకోవాలి. కూతురి పట్ల గల ప్రేమతో ఆమె ఏదంటే అది చేయడానికి ఆయన సిద్ధమవుతాడు. ఆయనను చూసుకునే ఆమె అలా ప్రవర్తిస్తోంది. తన మాటనే నెగ్గించుకుంటోంది.
తాను ఇప్పుడు తన ఆత్మాభిమానం గురించి ఆలోచించాలా? రాజ్యం – ప్రజలను గురించి ఆలోచన చేయాలా? లేదంటే తన తండ్రిని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు చేయడానికి అంగీకరించాలా? ఇలా శర్మిష్ఠ పలురకాలుగా ఆలోచన చేస్తూ సతమతమవుతుంది. చివరికి తండ్రి చెప్పినట్టుగా చేయడానికి సిద్ధపడుతుంది. రాజరికానికి .. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన శర్మిష్ఠ, తన కోసం తగ్గడం వృషపర్వుడికి ఆనందంతో పాటు కాస్త బాధను కూడా కలిగిస్తుంది. అలా దేవయాని మందిరానికి శర్మిష్ఠ దాసీగా వెళుతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.