శిశుపాలుడు “చేది” దేశానికి రాజు .. దమఘోషుడు .. సాత్వతిలకు జన్మించినవాడు. కృష్ణుడికి సాత్వతి మేనత్త అవుతుంది. శిశుపాలుడు పుట్టినప్పుడు ఆయన రూపం చాలా వికృతంగా ఉండేది. మూడు కన్నులు .. నాలుగు చేతులతో ఆయన జన్మించాడు. చూడటానికి ఆయన చాలా చిత్రంగా ఉండటంతో, ఆయన గురించి రాజ్యంలో అంతా మాట్లాడుకోసాగారు. తన కుమారుడిని చూసి అంతా భయపడటం .. గుసగుసలాడటం చూసిన సాత్వతి చాలా బాధపడుతుంది. తనకి అలాంటి సంతానం కలిగినందుకు కన్నీళ్ల పర్యంతమవుతుంది.
తన కుమారుడి వికృతరూపాన్ని పోగొట్టమని సాత్వతి దైవాన్ని ప్రార్ధిస్తుంది. అప్పుడు ఆకాశవాణి .. “ఎవరి స్పర్శ కారణంగా శిశుపాలుడి వికృత రూపం అదృశ్యమవుతుందో, వాళ్ల చేతిలోనే అతను చనిపోతాడు” అని పలుకుతుంది. ఆ మాటలు వినగానే తన కుమారుడి వికృత రూపం మాయమవడం కూడా తనని జీవితాంతం బాధించే విషయమేనని ఆమె శోకంలో మునిగిపోతుంది. అయితే తన కుమారుడు ఎవరి చేతిలో చనిపోతాడో తెలుసుకుంటే, వాళ్లను బ్రతిమాలైనా సరే అతణ్ణి బ్రతికించుకోవచ్చునని అనుకుంటుంది.
అప్పటి నుంచి ఆమె తమ ఇంటికి ఎవరు వచ్చినా, ఎత్తుకోమంటూ ఆ పిల్లాడిని ఇచ్చేది. ఇలా ఎంతమంది ఎత్తుకున్నప్పటికీ, ఆయన రూపంలో ఎలాంటి మార్పుకి రాకపోవడంతో ఆమె డీలాపడిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఒక రోజున మేనత్త ఇంటికి కృష్ణుడు వస్తాడు. మేనత్తను పలకరించిన కృష్ణుడు .. బాలుడైన శిశుపాలుడిని చూస్తాడు. అతణ్ణి కాసేపు ఆడించమని చెప్పి సాత్వతి .. శిశుపాలుడుని కృష్ణుడికి ఇస్తుంది. కృష్ణుడు తాకడమే ఆలస్యం శిశుపాలుడికి అదనంగా ఉన్న చేతులు .. కన్ను మాయమవుతాయి.
ఆ దృశ్యం చూసిన సాత్వతి నివ్వెరపోతుంది .. తన మేనల్లుడే తన కుమారుడి మరణానికి కారకుడు కానున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. జరిగిన సంఘటన గురించి కృష్ణుడికి వివరించిన సాత్వతి,తన కుమారుడిని అంతం చేయవద్దని కోరుతుంది. నూరు తప్పులవరకూ అతనిని ఏమీ చేయననీ, ఆ తరువాత మాత్రం తనని నిందించకూడదని మేనత్తతో చెబుతాడు. శిశుపాలుడు తప్పులు చేయకుండాగా చూసుకోవచ్చనే ఉద్దేశంతో సాత్వతి అందుకు అంగీకరిస్తుంది. అలాంటి శిశుపాలుడు యవ్వనంలోకి అడుగుపెడతాడు .. “రుక్మిణీదేవి”ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.