Somavaram

పరమశివుడు ఆయా క్షేత్రాలలో లింగాకారంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. కొన్ని క్షేత్రాలలో శివలింగాలు రుద్రాక్ష మాదిరిగా గరుకుగా కనిపిస్తూ ఉంటాయి. చాలా క్షేత్రాలలో శివలింగాలను రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉంటారు. అయితే రుద్రాక్షయే శివలింగంగా మారిపోయిన క్షేత్రం ఒకటి “సోమవరం”లో(Somavaram) కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో విలసిల్లుతోంది.

ఇటు నేరేడుచర్ల .. అటు మిర్యాలగూడ ప్రధాన రహదారిపై వెళుతుండగా, “సోమవరం”(Somavaram) గ్రామం తగులుతుంది. మెయిన్ రోడ్ పై నుంచి ఓ 8 కిలోమీటర్లు లోపలికి వెళితే శివాలయం దర్శనమిస్తుంది. “మూసీనదీ” తీరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయంలో పరమేశ్వరుడు “శ్రీ భృగుమాలిక సోమేశ్వర స్వామి”గా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. పూర్వం ఇక్కడి మూసీనదీ తీరంలో భృగు మహర్షి తపస్సు చేసుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది.

ఆయన చేతిలోని రుద్రాక్ష మాలికలో నుంచి జారిపోయిన ఒక రుద్రాక్ష .. శివలింగంగా మారిపోయిందని చెబుతారు. అందువల్లనే ఇక్కడి స్వామి శ్రీ భృగుమాలికా సోమేశ్వరస్వామిగా పిలవబడుతున్నాడు. అలా కొంతకాలం పాటు భృగు మహర్షిచే పూజించబడిన ఈ శివలింగం ఆ తరువాత మరుగున పడిపోయింది. కాకతీయుల కాలంలో మళ్లీ ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. రుద్రమదేవి కాలంలో కాకతీయుల పాలనా విభాగానికి చెందిన వేమారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది.

ఈ ఆలయ నిర్మాణాన్ని సూర్యోదయాన్నే మొదలుపెట్టి .. సూర్యాస్తమయానికి పూర్తి చేసినట్టుగా చెబుతారు. వేమారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించడానికిగల కారణంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. వేమారెడ్డికి ఒక్కగానొక్క వారసుడు ఉంటాడు. యుక్త వయసులో ఉన్న ఆ యువకుడికి కుష్టువ్యాధి వస్తుంది. తన వారసుడు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి వేమారెడ్డి ఆవేదన చెందుతూ ఉంటాడు. ఆ కుమారుడిని ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకుండా పోతుంది.

ఒక రోజున రాత్రి వేమారెడ్డి తన కుమారుడి వ్యాధిని గురించిన ఆలోచన చేస్తూ నిద్రకలోకి జారుకుంటాడు. అప్పుడు కలలో ఆయనకి శివుడు కనిపించి, ఒక రోజులో తన ఆలయాన్ని నిర్మిస్తే అతని కుమారుడి కుష్టువ్యాధిని తాను తగ్గిస్తానని పరమ శివుడు చెబుతాడు. దాంతో వేమారెడ్డి ఆలయ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని ఆ ప్రదేశానికి తరలిస్తాడు. అంతా సిద్ధంగా పెట్టుకుని, మరునాడు సూర్యోదయాన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి సాయంత్రానికి నిర్మాణం పూర్తి చేస్తాడు.

అదే సమయంలో అతని కుమారుడు గుర్రంపై అక్కడికి చేరుకుంటాడు. కొంతసేపటి క్రితమే తన వ్యాధి పూర్తిగా మాయమైపోయిందని తండ్రికి చెబుతాడు. ఆ తండ్రీ కొడుకులు పరమశివుడికి భక్తితో నమస్కరించుకుని కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇప్పటికీ కూడా ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన, దీర్ఘకాలిక వ్యాధులు .. బాధలు తగ్గిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.

ఆలయ ప్రాంగణంలో రెండు అంతస్థుల మంటపం ఒకటి కనిపిస్తుంది. ఎటు వైపు నుంచి ఎలాంటి మెట్లు లేకుండా పై అంతస్తును ఎలా నిర్మించారనేది ఇప్పటికీ అంతుబట్టదు. ఇక ఆలయానికి మరో వైపున ఒక చిన్నపాటి మందిరం కనిపిస్తుంది. దాని పక్క నుంచే “సొరంగ మార్గం” ఒకటి కనిపిస్తుంది. ఈ సొరంగ మార్గాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎక్కడి వరకూ ఈ సొరంగమార్గం ఉందనేది నిర్ధారణగా తెలియదు.

ఈ ఆలయ ప్రాంగణంలో అనేక నాగ ప్రతిమలు కనిపిస్తాయి. నాగదేవతలు కత్తి .. డాలు వంటి ఆయుధాలు ధరించి కనిపించడం విశేషం. ఈ ఆలయ నిర్మాణ విశేషాలు ఇక్కడి ప్రాంగణంలోనే కాకేజీటూలు వేయించగా శిలా శాసన రూపంలో దర్శనమిస్తూ ఉంటాయి. ఇక శివరాత్రి రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. వేలాదిమంది భక్తులు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి ధన్యులవుతుంటారు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2024 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2024 – Panchangam – App on Apple App Store