దేవకీదేవి .. వసుదేవులను కారాగారంలో ఉంచిన కంసుడు, వాళ్ల విషయాలను ఎప్పటికప్పుడు తన మనషుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. అలా దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను హతమారుస్తాడు. ఏడవ శిశువును కూడా తన కత్తికి బలి చేసే సమయం కోసం కంసుడు ఎదురుచూస్తూ ఉంటాడు. అయితే పరమాత్ముడు సప్తమ గర్భాన్ని “రోహిణి” గర్భాన ప్రవేశపెట్టిన కారణంగా అక్కడ ఆమెకి “బలరాముడు” జన్మిస్తాడు. దేవకీదేవి జన్మనిచ్చేది ఎనిమిదవ శిశువుకనీ, ఈ సారి జాగ్రత్తగా ఉండమని కంసుడును నారదమహర్షి హెచ్చరించి వెళతాడు.

దాంతో కంసుడు ఆలోచనలో పడతాడు .. కారాగారం దగ్గర మరింత కాపలా పెంచుతాడు. ఆ భగవంతుడే తమని ఈ కడుపుకోత నుంచి కాపాడాలని దేవకీదేవి .. వసుదేవులు మనసులోనే శ్రీమహావిష్ణువును తలచుకుంటారు. ఓ శుభముహుర్తాన ఆమె ఎనిమిదవ శిశువుకు జన్మిస్తుంది .. ఆ శిశువే అవతాపురుషుడైన “శ్రీకృష్ణుడు”. దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ శిశువును చూడగానే దేవకీదేవి .. వసుదేవులు సంతోషంతో పొంగిపోతారు. అదే సమయంలో వాళ్లకి ఆ శిశువు నుంచి మాటలు వినిపిస్తాయి.

గోకులంలో ఉన్న నంద యశోదల ఇంటికి తనని తీసుకెళ్లి, తన లీలా విశేషాల కారణంగా ఆడ శిశువుగా ఆమెకి జన్మించిన “యోగమాయ”ను తీసుకువచ్చి కంసుడికి అప్పగించమనే మాటలు విని వాళ్లు అందుకు పూనుకుంటారు. కృష్ణుడి మాయ కారణంగా కారాగారంలో కాపలా ఉన్న భటులంతా కూడా విపరీతమైన నిద్ర ముంచుకురావడంతో, ఎక్కడివాళ్లు అక్కడ కుప్పకూలిపోతారు. కారాగారం తలుపులు వాటంతట అవి తెరుచుకుంటాయి. దాంతో ఆ శిశువును వసుదేవుడు గోకులానికి తీసుకెళ్లి యశోద శయ్యపై ఉంచి, ఆమె గర్భాన జన్మించిన “యోగమాయ”ను కారాగారానికి తీసుకొచ్చేస్తాడు.

దేవకీదేవి .. వసుదేవులకు అష్టమ సంతానం కలిగిందని తెలియగానే కంసుడు అక్కడికి వచ్చేస్తాడు. దేవకీదేవికి జన్మించిన అష్టమ సంతానం కూడా తన నుంచి తప్పించుకోలేకపోయిందనే గర్వంతో, ఆ శిశువును హతమార్చడానికి కంసుడు ప్రయత్నిస్తాడు. అయితే ఆ శిశువు “యోగమాయ”గా కనిపించి, అతనిని సంహరించే అష్టమ సంతానం మరో చోట పెరుగుతున్నాడని చెబుతుంది. దేవకీదేవి అష్టమగర్భాన జన్మించిన శిశువు చేతిలో అతని మరణం తప్పదని చెప్పి అదృశ్యమవుతుంది. దాంతో కంసుడు నివ్వెరపోతాడు. ఎక్కడ ఎలా పొరపాటు జరిగిందో తెలియక అయోమయానికి లోనవుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.