యాదవ రాజైన సూరసేనుడు “మధురాపురము”ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన కుమారుడైన “వసుదేవుడు” .. ఉగ్రసేనుడి కుమార్తె అయిన దేవకీదేవిని వివాహం చేసుకుంటాడు. ఇద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేవకీదేవి అంటే సోదరుడైన కంసుడికి మొదటినుంచి కూడా విపరీతమైన ప్రేమ. ఆమె ఏది కోరినా ఆయన క్షణమైనా ఆలస్యం చేయక వెంటనే ఆమె ముచ్చట తీర్చేవాడు. అందువలన ఆయనే తన చెల్లెలినీ .. బావను తీసుకుని ఆమె అత్తగారింట వదలిరావడానికి రథంపై బయల్దేరతాడు. అలా వాళ్ల రథం ముందుకు సాగుతుండగా ఒక్కసారిగా ఆకాశంలో మార్పులు చోటు చేసుకుంటాయి.
హఠాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పులకు కంసుడు ఆశ్చర్యపోతాడు. కారణం ఏమై ఉంటుందా అనే ఆలోచన చేస్తూనే రథాన్ని వేగంగా నడుపుతుంటాడు. అలాంటి సమయంలోనే ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. దేవకీదేవి అష్టమ గర్భాన జన్మించినవాడి కారణంగా కంసుడు సంహరించబడతాడని ఆకాశవాణి పలుకుతుంది. దాంతో కంసుడు ఒక్కసారిగా రథం ఆపేస్తాడు. అప్పటివరకూ చెల్లెలిపట్ల ఎంతగానో ప్రేమానురాగాలను ఒలికించిన ఆయన ఒక్కసారిగా మారిపోతాడు. తనని అంతం చేసేవాడిని కనడానికి వీల్లేదంటూ దేవకీదేవిపై కత్తి దూస్తాడు.
వసుదేవుడు ఆయనను వారిస్తాడు .. కొత్తగా పెళ్లై అత్తవారింటికి వెళుతున్న సోదరిని హతమార్చడం న్యాయం కాదని చెబుతాడు. దేవకీదేవికి జన్మించిన ప్రతి శిశువును అతనికి అప్పగిస్తామనీ, దేవకీదేవిని మాత్రమే ఏమీ చేయవద్దని కోరతాడు. ఆ మాటలకి కంసుడు కొంత శాంతిస్తాడు. అష్టమ సంతానం కలిగేవరకూ తన కారాగారంలో ఉండాలనీ, జన్మించిన ప్రతి శిశువును తనకి అప్పగించాలని కంసుడు గట్టిగా చెబుతాడు. అందుకు వసుదేవుడు అంగీకరించడంతో, కంసుడు రథాన్ని వెనక్కి మళ్లిస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.