యతి వేషంలో తనతో సేవలు చేయించుకుంటున్నది అర్జునుడు అని తెలియగానే సుభద్ర సంతోషంతో పొంగిపోతుంది. తన గురించి అర్జునుడు ఆలోచించడం లేదు .. పట్టించుకోవడం లేదు అని ఇంతకాలంగా తాను అనుకున్నదాన్లో నిజం లేదని గ్రహిస్తుంది. తన కోసం యతి వేషంలో అర్జునుడు పడుతున్న అవస్థలను తల్చుకుని నవ్వుకుంటుంది. ఒక వైపున తన పెళ్లి విషయంలో బలరాముడిని ఎదిరించడానికి కృష్ణుడు సిద్ధంగా ఉన్నాడు .. మరో వైపున తనని వివాహం చేసుకోవడానికి అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు. అందువలన ఇక తాను ఆందోళన చెందవలసిన పనిలేదని అనుకుంటుంది.
అర్జునుడు విడిది చేసిన ప్రదేశానికి సుభద్ర వెళ్లి ఆయనను కలుసుకుంటుంది. ఆమెకి నిజం తెలిసిందని గ్రహించిన అర్జునుడు, కృష్ణుడు చెప్పేవరకూ తాను యతి రూపంలో ఉండవలసిందేనని అంటాడు. అలా వాళ్లిద్దరూ కలిసి ఆ వనంలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. బలరాముడు వచ్చినప్పుడు మాత్రం అర్జునుడు యతిలా నటిస్తూ నమ్మిస్తుంటాడు. ఇక ఆయన పూజ కోసమే తాను అక్కడ ఉన్నట్టుగా సుభద్ర ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె ముఖంలో మునుపటికన్నా ఎక్కువ తేజస్సు కనిపించడం చూసిన బలరాముడు, దుర్యోధనుడితో పెళ్లి అందుకు కారణమని అనుకుంటాడు.
దుర్యోధనుడితో సుభద్ర పెళ్లికి బలరాముడు ఏర్పాట్లు చేయడం మొదలు పెడతాడు. కృష్ణుడిని పిలిచి ఆయన చేయవలసిన పనులను అప్పగిస్తాడు. బలరాముడు శుభలేఖల వరకూ వెళ్లడంతో, తాను ఇక తొందరపడవలసిన సమయం దగ్గర పడిందని కృష్ణుడు భావిస్తాడు. ఇక సుభద్ర – అర్జునుల వివాహానికి సమయం ఆసన్నమైందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. తాను చేయవలసిన పనిని ఎంతో గోప్యంగా పూర్తి చేయాలని ఆయన భావిస్తాడు. దాంతో ముందుగా ఆయన అర్జునుడిని కలుసుకుంటాడు.
బలరాముడు .. దుర్యోధనుడితో సుభద్ర పెళ్లిని జరిపించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా అర్జునుడితో కృష్ణుడు చెబుతాడు. బలరాముడు .. దుర్యోధనాదులకు పంపిన వర్తమానం వాళ్లకి చేరకుండా చేయడం వలన తమకి ఆ వైపు నుంచి ప్రమాదం లేదని అంటాడు. అలా అని చెప్పేసి ఆలస్యం చేస్తే అంతా గందరగోళం అవుతుందని చెబుతాడు. అందువలన తాను సర్వం సిద్ధం చేసి .. సంకేతాలు పంపగానే రంగంలోకి దిగేలా సిద్ధంగా ఉండమని చెబుతాడు. అప్పటివరకూ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా నడచుకోమని అంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.