అలా ద్వారక నుంచి నడుస్తూ తన గ్రామంలోకి సుధాముడు అడుగుపెడతాడు. అందరూ తనని చిత్రంగా చూడటాన్ని ఆయన గమనిస్తాడు. తాను కృష్ణుడి సాయాన్ని అర్ధించడానికి ద్వారక వెళ్లినట్టుగా తన భార్య ఊళ్లోవాళ్లకు చెప్పేసి ఉంటుంది. తాను ఏమీ తేకుండా తిరిగి వస్తుండటంతో వాళ్లంతా అలా వింతగా చూస్తున్నారేమోనని అనుకుంటాడు. అలా ఆయన తన వీధి మలుపు తిరుగుతాడు. అయితే ఆ ప్రదేశంలో అందమైన ఉద్యానవనాలు ఉండటం చూస్తాడు. తన ఇల్లు ఉండవలసిన ప్రదేశంలో ఎత్తైన … విలాసవంతమైన భవనాలు ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు.

సుధాముడు ఒక్కసారిగా తన కళ్లను తాను నమ్మలేకపోతాడు. తనకి కనిపిస్తున్నది నిజమేనా? లేదంటే తాను ఏదైనా భ్రమలో ఉన్నాడా? అనుకుంటూ కళ్లు నలచుకుని మరీ చూస్తాడు. అందమైన వనాలు .. ఆ మధ్యలో ఎత్తైన భవనాలు అలాగే కనిపిస్తాయి. అసలు తాను వచ్చింది తన ఊరికేనా? అనే సందేహం ఆయనకు కలుగుతుంది. అలా అనుకుంటే కొంతసేపటి క్రితం తనకి ఎదురైనవారు తన ఊరివాళ్లే కదా అనుకుంటాడు. ఇంతటి భవనాలు తన ఊళ్లో తాను ఎప్పుడూ చూసింది లేదు. పైగా తన ఇల్లు ఉన్న ప్రదేశంలో విశాలమైన భవనాలు కనిపిస్తున్నాయి అనుకుంటాడు.

మరి తన భార్య బిడ్డలు ఏమైనట్టు? వాళ్లు ఎక్కడికి వెళ్లారు? అసలు ఇంత తక్కువ సమయంలో ఇంతటి భవనాల నిర్మాణం అక్కడ ఎలా జరిగింది? అని ఆయన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. అదే సమయంలో ఆయన భార్య బిడ్డలు ఎంతో ప్రేమగా ఆయనకి ఎదురువస్తుంటారు. వాళ్లు ఖరీదైన పట్టువస్త్రాలను .. వివిధ రకాల ఆభరణాలను ధరించి ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆయన ద్వారక వెళ్లిన తరువాత మంత్రం వేసినట్టుగా .. మాయ చేసినట్టుగా ధన .. కనక .. వస్తు.. వాహనాలు అమరినట్టుగా భార్య చెబుతుంది.

భార్య మాటలు వింటూ .. పిల్లల చేతులు పట్టుకుని ఆ భవనంలోకి ప్రవేశిస్తూ సుధాముడు ఆశ్చర్యపోతాడు. కృష్ణుడు తన పరిస్థితి ఎలా ఉందని అడగలేదు .. ఇలా ఉందని తాను చెప్పలేదు. అడగకుండా ఆయన మాత్రం ఎలా సాయం చేస్తాడనే తాను అనుకున్నాడు. కానీ కృష్ణుడు అడగకుండానే అన్నీ గ్రహించాడు. ఆయన అందించిన సాయం తాత్కాలికమైనది కాదు .. తరతరాలకు సరిపడే సంపదలను చేకూర్చాడు. కేవలం తాను తీసుకెళ్లిన గుప్పెడు అటుకులు గ్రహించి, అనంతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. ఆయన చేసిన మేలును ఎలా మరువడం అనుకుంటూ ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా ఆ స్వామికి మనసులోనే నమస్కరించుకుంటాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.