శ్రీకృష్ణుడిని కలుసుకుని .. ఆయన ఆతిథ్యాన్ని అందుకుని ద్వారక నుంచి సుధాముడు బయల్దేరతాడు. రథంపై తాను పంపిస్తానని చెప్పినా, సున్నితంగా తిరస్కరించి సుధాముడు నడకసాగించడం మొదలుపెడతాడు. ఆయన అలా ముందుకు సాగుతుంటాడేగానీ ఆయన ఆలోచనలు ద్వారక చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కృష్ణుడు తనని అంతగా గుర్తుపెట్టుకుంటాడనిగానీ, అంత ఆప్యాయంగా చూస్తాడనిగాని తాను ఊహించలేదు. అంతఃపురములోని పరివారమంతా ఆశ్చర్యపోయేలా .. వాళ్లందరికీ తనపై గౌరవం కలిగేలా కృష్ణుడు చూశాడు.
సాధారణంగా చదువుకునేటప్పుడు కలిగే స్నేహాలు వేరు. పెద్దయ్యాక .. వివాహమయ్యాక పాత స్నేహాల బలం తగ్గుతుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచన చేసుకునే సమయం ఉండదు .. ఎవరు ఏం చేస్తుంటారనే ధ్యాస ఉండదు. ఇక శ్రీమంతులైన వారికి వ్యాపకాలు ఎక్కువ .. అందువలన తమ క్రింది వారిని గురించిన ఆలోచన వాళ్లకు అసలు ఉండదు. కొంతమందికి మనసులో పాతకాలం నాటి స్నేహభావాలు అలాగే ఉన్నప్పటికీ, ప్రస్తుతం వాళ్లు ఉన్న పరిస్థితుల కారణంగా బయటికి చాటుకోలేరు. తమ ప్రస్తుత పరిస్థితికి తగినట్టుగానే వాళ్లు వ్యవహరిస్తారు.
కానీ కృష్ణుడు అలా కాదు .. ఒక ఊరంతటి భవనాల సముదాయంలో ఆయన నివసిస్తున్నాడు. అష్టలక్ష్ములే అష్ట భార్యలుగా ఉన్నారా? అన్నట్టుగా వాళ్లు రత్నాభరణాలతో మెరిసిపోతున్నారు. ఆ ఉద్యానవనాలు .. ఆ సరస్సులు .. ఆ విలాస భవనాలు .. ఆ విశ్రాంతి మందిరాలు .. ఆ భోజన పదార్థాలు తాను ఇంతవరకూ ఎక్కడా చూసింది లేదు. అలాంటి భోగాలను అనుభవిస్తున్న కృష్ణుడు, తన పాదాలను కడగడం .. తన దగ్గరే కూర్చుని వడ్డించడం .. జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి? అనుకుంటాడు.
కృష్ణుడు తనని అభిమానంతో చూడటంలో అర్థం ఉంది .. కానీ ఆయన భార్యలంతా కూడా ఆయనతో పాటు తనని ఎంతో అభిమానంతో చూశారు. తన స్థితిని ఎంతమాత్రం పట్టించుకోకుండా ఎంతగా గౌరవించారని? ఆ రోజున విద్యాభ్యాస సమయంలో తన అటుకులను కృష్ణుడు ఎంత ఇష్టంగా స్వీకరించాడో .. ఈ రోజున కూడా అంతే ఇష్టంగా తీసుకున్నాడు. ఆయన కావాలనుకుంటే అటుకులు తెప్పించడం ఎంతపని? నిజం చెప్పాలంటే కృష్ణుడు తన సంపదలకంటే తమ స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చాడనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.