అంబరీషుడిపైకి తాను ప్రయోగించిన కృత్య అనే రాక్షస శక్తిని సుదర్శన చక్రం సంహరించడం చూసి దుర్వాసుడు ఆశ్చర్యపోతాడు. అంతటి శక్తి సుదర్శన చక్రానికి లేదని కాదు .. అంతటి భక్తుడు అంబరీషుడు అనుకోకపోవడమే అందుకు కారణం. తన ప్రాణాలను కాపాడిన సుదర్శన చక్రానికి అంబరీషుడు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. ఆ తరువాత సుదర్శన చక్రం అక్కడి నుంచి యథా స్థానానికి వెళ్లిపోతుందని అంతా అనుకుంటారు. కానీ అది ఒక్కసారిగా దిశ మార్చుకుని దుర్వాసుడి వెంటపడుతుంది.
తాను మహర్షి .. తపోబల సంపన్నుడు .. దేవతలతో సైతం పూజించబడినవాడు. అలాంటి తన పైకి సుదర్శన చక్రం వస్తుందని ఆయన ఎంతమాత్రం ఊహించడు. కానీ అది వాయువేగంతో దూసుకొస్తూ ఉండటంతో, వెనుదిరిగి చూస్తూనే పరుగందుకుంటాడు. అలా ఆయన తన తపోశక్తితోనే అత్యంత వేగంతో సత్యలోకం దిశగా సాగుతాడు. మహా తపస్వి అయిన దుర్వాసుడు భయంతో పరుగులు తీస్తూ రావడం చూసిన బ్రహ్మదేవుడు, విషయమేమిటని అడుగుతాడు. దాంతో జరిగిన సంఘటనను గురించి ఆయనకు హడావుడిగా చెప్పి, సుదర్శన చక్రం నుంచి తనని రక్షించమని కోరతాడు.
సుదర్శన చక్రం బారి నుంచి తాను కాపాడలేననీ, పరమశివుడి వలన ఏమైనా అవుతుందేమోనని అడగమని బ్రహ్మదేవుడు చెబుతాడు. అవసరమైన సమయంలో .. ఆపద సమయంలో మరోమాట చెప్పవద్దనీ, ఆయన కాపాడగలడనే నమ్మకం తనకి ఉందని దుర్వాసుడు అంటాడు. విష్ణుమూర్తి లీలా విశేషాలను తెలుసుకోవడం .. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఎదురువెళ్లడం సాధారణమైన విషయం కాదనీ, అందువలన సదాశివుడి వలన ఏమైనా అవుతుందేమో చూడమని బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడు.
అప్పటికే సుదర్శన చక్రం తరుముతూ అక్కడికి రావడంతో, దుర్వాసుడు అక్కడి నుంచి తప్పించుకుని కైలాసానికి పరుగుతీస్తాడు. ఎప్పుడూ చూసినా ఆగ్రహావేశాలతో కనిపించే దుర్వాసుడు భయపడుతూ ఉండటం చూసిన శివుడు ఆశ్చర్యపోతాడు. సమస్తము ఎరిగినవాడే అయినా, ఏమీ తెలియనివాడిలా ఏం జరిగిందని అడుగుతాడు. దాంతో సుదర్శన చక్రం తనని తరుముతూ రావడానికి గల కారణం చెబుతాడు. అయితే సుదర్శన చక్రాన్ని వెనక్కి మళ్లించడం విష్ణుమూర్తి వల్లనే అవుతుందనీ, ఆయనను ఆశ్రయించడమే మంచిదని సదాశివుడు చెబుతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.