సీతారామలక్ష్మణుల ఆలయం లేని ఊరంటూ దాదాపుగా కనిపించదు. అలా స్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో “తమ్మర” సీతారామాలయం ఒకటి. సూర్యపేట జిల్లా కోదాడకి అత్యంత సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కోదాడ బస్టాండ్ నుంచి ఆటోల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మితమైంది. పొడవైన ప్రాకారం .. ఎత్తైన రాజగోపురం .. ప్రాకారమంటపాలు .. విశాలమైన ప్రదక్షిణ మార్గం .. ఆలయ వైభవానికి అద్దం పడతాయి.
గర్భాలయంలో సీతారామలక్ష్మణులు .. ఎదురుగా గల ప్రత్యేకమైన మంటపంలో హనుమంతుడు దర్శనమిస్తారు. ముందుగా హనుమంతుడే ఇక్కడ పూజలు అందుకుంటూ ఉండేవాడట. ఆ తరువాత కాలంలో ఈ ప్రదేశంలోని పుట్టలో నుంచి సీతారాముల ప్రతిమలు బయటపడ్డాయని స్థల పురాణం చెబుతోంది. ఒక భక్తుడికి కలలో స్వామి కనిపించి తన జాడ చెప్పడం వలన ఇక్కడి పుట్టలోని ప్రతిమలు వెలుగు చూడటం జరిగిందని అంటారు. ఆ తరువాతనే ఆలయ నిర్మాణం జరిగింది.
ఇదే ఆలయంలో చెన్నకేశవస్వామి మూర్తి కూడా దర్శనమిస్తుంది. రామాలయంలో చెన్నకేశవ స్వామి ఎలా కొలువయ్యాడు? అనే సందేహం రావడం సహజం. అందుకు ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ గ్రామం మధ్యలో శిధిలావస్థలో ఉన్న కోట గోడలు ఉండేవట. ఒక గోడకి ఈ చెన్నకేశవస్వామి మూర్తి ఆనించినట్టుగా ఉండేది. ఆ గ్రామానికి చెందిన ఒక భక్తురాలు .. అను నిత్యం స్వామివారి సన్నిధిలో దీపం పెడుతూ .. తనకి తోచిన నైవేద్యం పెడుతూ ఉండేది.
అలాంటి పరిస్థితుల్లో ఆ పక్కనే గల గ్రామంలోనివారు తమ ఊళ్లో ఆ మూర్తిని ప్రతిష్ఠించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్రామం వారి అనుమతితో ఆ విగ్రహాన్ని ఎడ్ల బండిపై ఎక్కించుకుని ఊరేగింపుగా తమ గ్రామానికి బయల్దేరారు. అయితే అనునిత్యం చెన్నకేశవ స్వామిని ఆరాధించే ఆ భక్తురాలు కన్నీళ్ల పర్యంతమవుతుంది. ఆ స్వామిని విడిచి తాను ఉండలేనంటూ కుప్పకూలిపోయింది. అంతే కొంతదూరం వరకూ వెళ్లిన ఎడ్లబండి అక్కడే ఆగిపోయింది. ఎడ్లు ముందుకు కదల్లేదు. అక్కడి నుంచి అవి నేరుగా వెనక్కి తిరిగి వచ్చి హనుమంతుడి మందిరం దగ్గర ఆగాయట.
తమ్మరలోనే తాను ఉంటానని స్వామి ఇచ్చిన సంకేతంగా భావించి .. ఇక్కడి ఆలయంలోనే ఆ మూర్తిని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి సీతారాములతో పాటు చెన్నకేశవుడు కూడా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. సీతమ్మవారు ఒక భక్తుడికి స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడి భావి నిర్మాణం చేయించిందని అంటారు. ఎంతటి ఎండాకాలమైనా ఈ బావిలోని నీరు మాత్రం తగ్గదు. ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించడానికిగాను, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. భక్త రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న గ్రామమైన “నేలకొండపల్లి” ఇక్కడికి దగ్గరే కావడం విశేషం. ఈ క్షేత్ర దర్శనం వలన సకల శుభాలు చేకూరతాయనేది భక్తుల బలమైన విశ్వాసం.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.